Monday, April 04, 2005

రైలు

రైలు మరి కాసేపట్లో వస్తుందని వినబడి అమ్మయ్యా అనుకొన్నా ..వినబడినప్పుడు నేను కాకుండా ఇంకో యాభయి మంది ఉన్నారు ప్లాట్ ఫారం మీద ..కనబడే సమయానికి దాదాపు అయిదు వందలమంది అయారు ! ముందుగానే చెప్పారు ఈ రైలుకి చాలా మంది ఉంటారు అని ..రైలు భారీగా నిట్టూరుస్తూ ఆగింది ..అరుపులు కేకలు పరుగుల మధ్య నేను కూడా ఎక్కా...ఇదే మొదటి స్టాపు కావడంతో సీట్లు ఖాళీ గానే ఉన్నాయి ..నేనెక్కిన పెట్టె లో అందరూ ఇరవై ఏళ్ళకి మించని వాళ్లే ...నేను ఆలోచిస్తున్నా ..ఇక్కడ ఏ కాలేజి ఉందా అని ..."పొట్టోడా ,నత్తోడా రా?" అని నా పక్కనున్న కుర్రాడు తలుపు దగ్గరున్న వాళ్లని అడిగాడు..వాళ్లు ఇతనిని పట్టించుకోకుండా వాళ్ల కబుర్లలో ఉన్నారు." అబే ,నీయబ్బ రవిగా ఎవడొచ్చాడు అంటే చెప్పవేంది బే " -- "నీ మామ వచ్చాడు " అందరూ గట్టిగా నవ్వారు . "వాడైతే వాకే ..సట్టోడు అయితే అయిదు రూపాయలు బొక్క " అని నా పక్కనే కూచొన్నాడు ..చేతిలో పుస్తకాలు లేవు ..కానీ అన్నం కారియర్లు ఉన్నాయి అందరి దగ్గరా ..కాళ్లకి స్లిప్పర్లు ..దాదాపు అందరి చేతుల్లో రుమాళ్లు ..జేబులో దువ్వెన ... వీళ్లు చదువుకోడానికి రాలేదని అర్ధం అయింది ..." ఏ ఊరు " అని అడిగా ..."బోనకల్ సారు " అన్నాడు .. "మీదే ఊరు సారు ?" చెప్పా.."ఏం చేస్తారు మీరంతా " .."క్వారీ పనికి పోతాం సారు" .."చదువుకొన్నావా? " "పది పాసయి ఆపేసిన " "ఏం?" " పొలం పండలే ..అప్పులు చేసినం ..అక్క పెళ్లి చేసినం..తమ్ముడు చదువుతున్నాడు .. మా నాన్న ఒక్కడితో ఇళ్లు నడుస్తలేదు ..అందుకే ఈ పనికి పోతున్నా" .."ఎంతిస్తారు రోజుకి?" " ఇస్తారు ఎనభై దాకా ..ఎక్కువ బళ్లు నింపితే ఎక్కువొస్తది ..కానీ కష్టం అయితది " "పనిలో బూట్లు ఇవ్వరా?" " బూట్లా? " తల అడ్డంగా తిప్పాడు ..ఎప్పుడో చదివిన లెజిస్లేషన్ గుర్తొచ్చింది ..కాని అది వాడికి అర్ధం కాదని నాకర్ధం అయింది .."మరి ఇంకా చదివితే వేరే మంచి పని చేసుకోవచ్చు గా?" "అప్పటికి ఆ ఉన్న నాలుగెకరాలు కూడా అమ్మాలి సారు ..అప్పుడు అంత చదివి ఏ ఉద్యోగం రాక పోతే చేసుకోడానికి ఆ పొలం కూడా ఉండదు " నవ్వుతూ చిన్న విషయం లా తేల్చేసాడు ."ఒరేయ్ ..సట్టోడు కూడా ఉన్నాడు" తలుపు దగ్గర నుండి కేక ...మొహంలో మార్పు ..."థూ దీనవ్వ ..ఇప్పుడు వీడికి 10 బొక్క " గొణిగాడు ..."టికెట్ కొనలేదా?" " లేదు సార్ ..వచ్చే ఎనభై లో రాను పోను 10 పెట్టి టికెట్ కొంటే ఎట్ల సారు ...నెలకి మూడు వందలైతే తమ్ముడి స్కూలు కి ఫీజు కైనా ఉంటయి " "మరి పట్టుకొంటే?" " పట్టుకొంటే తలకి పది వసూలు చేస్తడు సార్ " అదేదో మామూలు విషయం అయినట్లు చెప్పాడు ..." వస్తుండారా? ఏ పెట్టి లో ఉన్నడు? " " రాలేదు లే బే ..ఊరికినే అన్నం.." "&****& &***& " బూతులు తిడుతూ తలుపు దగ్గరకి పోయి వాళ్లతో కలిసాడు ...బోనకల్ రాబోయే ముందు వచ్చి కారియర్ తీసుకొన్నాడు ..500 తీసి ఇవ్వబోయా ...అర్ధం కానట్లు చూసాడు ..."తీసుకో మీ తమ్ముడికి ఫీజు కట్టు " " వద్దు సార్ ..అట్ల తీసుకొనేటోడి నైతే ఇదే రైళ్ల అడుక్కొంటూ బతికేటోడిని గద ..పోతున్న సారు " అని తలుపు వైపు నడిచాడు ...

2 comments:

Ratna said...

baavundi...kaani dabbulu offer cheyyadam baledu.. (just personal opinion). Mana daggara unnayi kada ani , offer cheste kondariki aatmaabhimaanam debba tintundhi ani telusukunna idi chadivi

oremuna said...

Good to see u got one more reader other than me and neelima.


There are people in such situation in millions, we can not give everybody a 500/-

If we can do try to increase employement;