Monday, April 16, 2007

టూకీగా

భార్యా భర్తల మధ్య మాటలు లేనప్పుడు - ఇంట్లో గిన్నెలు , తపాలాలు మాట్లాడతాయి :)

Friday, April 13, 2007

చదువు

ఏంటబ్బా ఇంకా మనవాళ్లు వెనకబడి ఉన్నారు అనుకొంటున్నా -- తెచ్చేసారు కొత్త చట్టం - పిల్లలని కొడితే జైలు --- భేష్
" అసలు సంస్కారం ఉండాలి .చదువుకొనే ఆసక్తి ఉండాలి .చదువుని ఎంజాయ్ చేయాలి .రాత , అట్టానే చదువు అట్టానే ఉండాలి .రాయడం ఒక అనుభవం , మనం ఏదైనా సరే మనుసుని వికసింపచేసేది , అసలు మనసుని ఆహ్లాద పెట్టేది ఏది చెప్పినా అది గొప్ప లిటరేచర్ అయిపోవాలి ఆ చదివేవాళ్లకి గూడా అబ్బా! ఈ పుస్తకం ఇవాళ చదవాల్సి వచ్చిందే, ఏం కర్మం పట్టిందని తెల్లారగట్టే లేచి కూచొని చదివేట్టుగా ఉండకూడదు. తక్కిన సంతోషాలు లోకంలో ఉండవూ. ఆవిధంగానే తను ఎంజాయ్ చేసేటటువంటి ఒక విషయంగా ఉండాలి చదువు అంటే.బడి ఉంటుంది , దాంటో పాఠాలు అక్కర్లేదు . మనం కావలసిన కధల పుస్తకాలో, నవలలో, ప్రయాణపు కధల పుస్తకాలో , ఇవన్నీ కూడా చదువుకునేందుకు ఉపయోగపడాలి . గొప్ప కవిత్వం తెలుసుకోవాలి . ఎంతసేపటికి ఈ క్లాస్ పాస్ అయి పైక్లాస్ ని ఎట్టా పోవాలి? అందులో కూడా తను క్లాస్ సంపాయించాలి. తక్కిన వాళ్లతో పోటీబడి తను ప్రధముడై రావాలి . తను ఏ విధంగా వచ్చినా సరే, దాని కోసం ఎన్ని సంవత్సరాలు ప్రజల జీవితాలు కాలిపోతున్నాయో చూడండి. పుట్టినప్పటినుంచి రెండో ఏడో, మూడో, పదో ఎప్పుడు వస్తుందా? వీణ్ణి ఎట్టా తోద్దామా? అని చూస్తో ఉంటారు.అక్కడనుండి చదువు చదువు అని రోజల్లా చదువే . రాత్రల్లా చదువే . ఊరికే చదవడమే పని . జీవితమంతా వౄధాయే కదా !
కానీ బుద్ధీమంతులు నలుగురూ కూచొని అన్ని పద్ధతుల్ని తిట్టినట్టే ఈ చదువుల్లో నిజంగా ఏది అవసరం? ఏది నిజంగా ప్రజలకి ఉత్తేజం కలిగిస్తోంది ? వీళ్ల బతుకుల్ని ఏది వికాసం చేస్తుంది? ఈ విధమైన చదువుల్ని మాత్రమే ఉంచి తక్కిన వాటిని తీసేయ్యాలి అని చర్చించుకోవాలి। ఎక్కడా బడి అంటే బలవంతం ఉండకూడదు . ఎక్కడన్నా ఓ ధర్మశాల పెట్టి మంచి భోజనాలు పెడుతున్నారనుకోండి . అందరూ పరిగెత్తరా అక్కడికి? ఎవరన్నా గెంటాలా అక్కడికి పొమ్మని? అట్టానే చదువులు కూడా . పాఠశాలలనేవి అందరికీ తెరిచి ఉండాలి , ఈ లోకమే తెరిచి ఉన్నట్టు . ఎవరికి ఏ విధమైన సంస్కారం కావాలో, ఎవరికి ఇక్కడ చెప్పే సంగతులు ఎవరిలో గొప్ప సంతోషాన్ని, ఉత్తేజాన్ని ఇస్తాయో వాళ్లందరూ రండి ఊరికే వొచ్చి కూచొని వినండి . గుళ్లల్లో సత్రాల్లో ఎక్కడన్నా పురాణం చెపుతుంటారు .ఇష్టమైన వాళ్లందరూ వినడం లేదూ? ఆ విధంగా చెప్పాలి చదువంతా .ఎవరన్నా ఒచ్చి చదవొచ్చు . ఎవరన్నా దాన్ని స్వీకరించి అర్ధ యుక్తం చేసుకోవచ్చు .ఇప్పుడు క్రమంగా ఈ దేశంలో మొదటినుంచి చివరి వరకు చదువు రెజిమెంటేషన్ గా మారిపోబోతోంది . ప్రస్తుతం విధ్యావిధానం రాజకీయాలతో అంకితమై పోయింది . తక్కిన దేశాలకన్న స్వదేశంనించి ఎక్కువ విధ్యాధికులు కావాలనే పంతం పెరిగింది . ఈ కాలేజీ లో చదువుకున్న కొద్దిమంది యువకులు ఎక్కువ సమర్ధులవుతారనే విశ్వాసం హెచ్చింది . ఆ కాలేజీలో యూనివర్సిటీలో భోధించే సబ్జెక్ట్సు కూడా ఇతర దేశాలమీద దౄష్టి పెట్టుకొనే ఏర్పరుస్తున్నారు . కనుక రాజకీయ విధానం మారితేనే గాని విధ్యా విధానం మారదు . "
--- చలం - "చలం" లో 1972 లో ...
ముందు చదువు చెప్పే విధానంలో పక్క వాడిని అనుకరించితే మంచిదేమో? " మళ్ళీ బడికి" "అక్షరజ్యోతి" "నిర్బంధ విధ్య " లాంటి అర్దం పర్ధం లేని కార్యక్రమాలు ,ఇలాంటి ఎవడూ లెక్క చేయని చట్టాలు చేసే బదులు ?

Tuesday, April 10, 2007

దేవుని పరిపాలన

దేవుని పరిపాలన అంటే ఏంటో అనుకొనేవాడిని - ఇప్పుడు కొంచెం అర్ధం అయింది - తప్పులు చేయనివ్వు - విచారణ కి ఆదేశించు - తప్పు ౠజువైతే క్షమాభిక్ష పెట్టు - ఈ లెక్కన ఎవడూ తప్పు చేయనట్టే కదా - తప్పులే జరగని లోకం దేవలోకమే(?) కదా - అదన్నమాట సంగతి .