Thursday, April 14, 2005

ప్రయత్నం

గత కొన్ని రోజులుగా ఒక పని చేయడానికి ప్రయత్నిస్తున్నా ...ఆ పని ఇక్కడ ఒక post రాయడం ...ఆ పోస్ట్ ఎలా ఉండాలంటే ...నాకే పరిమితం కావాలి ...అది వేరెవ్వరికి సంబంధించింది కాకూడదు ...ప్రత్యక్షం గా కానీ పరోక్షం గా కానీ ...నేను నాతో మాత్రమే ఉన్నప్పుడు జరిగింది ..ఎక్కడైనా చూసింది , విన్నది కాకూడదు ...చదివిన విషయం కూడా కాకూడదు ...నా స్వంతం అయినది అయి ఉండాలి ..అది రాసేప్పుడు నా బుర్రలో ఎవరి గురించి ఆలోచనలు రాకూడనిది అయి ఉండాలి ...అది కష్టం అని తెలిసింది ...దానర్ధం "నేను" అనేదే లేదు అనా? అయి ఉండొచ్చు ...కానీ ఉందని తెలుస్తూనే ఉంది ...ఎంచేతంటే నేను లేక పోతే మిగతావి లేవు ...ఉన్నది నేను ఒక్కటే...దాని చుట్టు అల్లుకొన్నవే మిగతావన్ని ...

ఇంతకీ ఈ పోస్ట్ పైన చెప్పిన లక్షణాలన్ని కలిగి ఉన్నట్టుంది :D

Friday, April 08, 2005

భయం

మెళుకువ వచ్చింది ...అప్పుడే ఆరయిందా అనుకొంటూ టైము చూస్తే 3.40 అవుతుంది ..మెళుకువ ఎందుకొచ్చిందా అని ఆలోచిస్తున్నా ...ఇది రైలు వెళ్ళే టైము కూడా కాదు ..నాకు కలలు రావు అని గట్టి నమ్మకం ..మరెందుకు లేచా ఎటూ కాని టైములో ...సన్నగా వినబడుతుంది ...గత అయిదారేళ్లుగా వినబడని శబ్దం ...చిన్న పాప ఏడుపు ...ఆ శబ్దం ఏంటో అర్ధమయ్యాక బిగ్గరగా వినబడుతోంది ...పక్క అపార్ట్ మెంటు లో నుండి ..చాలా కష్టం గా ఉంది వినడం ...బహుశా ఏడుపు అంత బాధతో కూడుకొన్నది విని చాలా కాలం అయి ఉండటం వల్ల కావొచ్చు ...పాపం ఆ పాపకి ఏమి బాధో ...అంతలా ఏడుస్తుంది ...అమ్మ భుజం మీద వేసుకొని ఊరుకో అని ఊరడిస్తూ ఉండి ఉంటుందా? ఒక్క ఏడుపు మాత్రమే వినబడుతుంది అంత నిశ్శబ్దంలో ...ఇక ఆపుతుంది , ఇప్పుడు ఆపుతుంది అని అనుకోబట్టి దాదాపు 45 నిముషాలు అయిందని మళ్లోసారి టైము చూస్తే అర్ధం అయింది ...దాదాపు గంట నుండి పాప ఏడుస్తుంటే ఎవరూ పట్టించుకొన్నట్లు లేరే? కారు స్టార్టు అయిన శబ్దం...అమ్మయ్య హాస్పిటలు కి బయలు దేరారేమో ...కారు వెళ్లి పోయింది ..పక్క ఇంట్లో పాప ఏడుపు ని వదిలేసి ..వెళ్లి తలుపు కొట్టి ఏమన్నా హెల్ప్ కావాలేమో అడిగితే? ఇంత రాత్రి ఎవడో ముక్కు మొహం తెలీని వాడు వెళ్లి తలుపు తడితే తీసి మాట్లాడే రకాలు కాదీ ఈ జనం..పైగా పోలీసు ని పిలిచినా పిలుస్తారు.పాప ఏడుపు ఏ మాత్రం తగ్గకుండా అలానే ఉంది ..ఏమయితే అదవుతుందని లేచి బయలు దేరా..ఈ అవతారం లో చూస్తే ఖచ్చితంగా భయపడతారని తల దువ్వుకొని , బట్టలు సరి చేసుకొని బయటకి వచ్చా...చలి వణికిస్తుంది ...ఏడుపు వినిపిస్తున్న ఇంటి వైపు నడిచా ..అంతలా ఏడుస్తున్నా ఆ ఇంట్లో లైటు వెలగడం లేదు ..అంటే అందరూ ఏడుపు వినిపించనంత గాఢ నిద్రలో ఉండి ఉంటారా? మెట్లదాకా వెళ్ళాక వాళ్లు నన్ను చూసి భయపడతారేమో అని నాకు భయం వేసింది ..వెనక్కొచ్చి ఫాన్ ఆన్ చేసి పడుకొన్నా ... పరిచయమయిన శబ్దం కాబట్టి నిద్ర పట్టింది ...పొద్దున్నే మళ్లీ లేవగానే పాప ఏడుపు గుర్తొచ్చింది ..ఇంకా ఏడుస్తుందా అని విన్నా ...ఆపేసింది :) ...కానీ వీలయితే ఆ పాప ఎవరో చూడాలి ఓ సారి...

Thursday, April 07, 2005

విద్యుదీకరణ-చర్చలు-పోప్

మొన్న నాలుగో తారీఖున ప్రియతమ ప్రధాని "రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజన"అనబడే ఒక ప్రాజెక్టు ప్రారంభిస్తూ 2009 కల్లా ప్రతి ఇంటికి విద్యుత్ సరఫరా చేస్తాం అన్నారు . 2009 న మళ్లీ ఈ బ్లాగు చూడాలి ఓ సారి గుర్తు పెట్టుకొని ...నాకో ఆలోచన వచ్చింది మన నాయకులు చేసే వాగ్దానాలన్నిటిని ఎక్కడన్నా బ్లాగు లో ఉంచితే బాగు :)
ఆలోచన అంటే ఇంకో ఆలోచన కూడా వచ్చింది ..ప్రస్తుతం చర్చల సీజన్ నడుస్తుంది ..అన్నలతో చర్చలు , మందుల షాపుల వాళ్లతో చర్చలు , వర్తక సంఘాలతో చర్చలు ..చర్చలు జరిపే ఒక consulting లేదా outsourcing కంపెనీ పెడితే మంచి గిరాకీ ఉండేలా ఉంది ..
TV పెడితే చాలు పోప్ గురించే ఏదో ఒకటి ..మనుషులంతా ఒక్కటే..కానీ దేవుళ్లే వేరు..పోప్ జీవితం నుండి నాకు అర్ధం అయింది అది .

Tuesday, April 05, 2005

రెస్టారెంటు

విజయవాడ - అలంకార్ రెస్టారెంటు
కడుపు నిండుగా తినేసి చేయి కడుక్కోడానికి వాష్ బేసిన్ దగ్గరకి నడిచా ...చేయి కడుగుతూ ఉండగా వచ్చాడు వాడు ..పది పన్నెండు మధ్య ఉంటుంది వయసు ..పక్క వాష్ బేసిన్ కడుగుతున్నాడు ..చుట్టూ విషయాలేమీ పట్టనట్టు పాట పాడుకొంటూ వాడి పని వాడు చేసుకొంటున్నాడు ..." నీ పేరేంట్రా?" అడిగా .."రాము సార్ " .."ఏ ఊరు ?".."పొన్నూరు " ..."నీకు ఎన్నేళ్లు రా?" "పద్దెనిమిది సార్ " నవ్వుతున్నాడు ..కాదని నాకు తెలుసని వాడికీ తెలుసు అనేది ఆ నవ్వులో కనపడింది ..."చదువుకొన్నావా?" "మూడు దాకా చదివా సార్" ..ఆ విషయం మాట్లాడటం వాడికి ఇష్టం లేనట్టుగా మొహం లో భావాలు మార్చేసాడు ..చదవలేక పోయా అన్న బాధేమో అనుకొన్నా .."చదువు చెప్పిస్తా చదువుకొంటావా?" అడ్డంగా తల తిప్పాడు ."ఏం?" "చదువు నాకు ఇష్టంలేదు సార్ ...నాకు పనే ఇష్టం..ఇది కాకపోతే ఇంకోపని , నాకు ఇష్టం అయింది చేస్తా ..బడికి పోను..నాకు నచ్చలేదు బడి " ....వాడి పని అయిపోయింది ...వెళ్లి పోయాడు లోపలకి ...
చదువు ని పిల్లలకి ఇష్టమయ్యేలా ఎప్పటికి చెప్తారో ??? చదువంటే 8 గంటలు పిల్లలకి జైలు ,పెద్దలకి స్వేచ్చ లా అయింది ..చెప్పిందే చెప్పడం ..రాసిందే రాయడం ..ఇరుకు ..ఉక్క ..నిశ్శబ్దం ..బెత్తం దెబ్బలు ...పరీక్షలు ...రాంకులు ...గొప్పలు ..తిట్లు ...చావులు ...ఇదీ పరిస్థితి....

Monday, April 04, 2005

రైలు

రైలు మరి కాసేపట్లో వస్తుందని వినబడి అమ్మయ్యా అనుకొన్నా ..వినబడినప్పుడు నేను కాకుండా ఇంకో యాభయి మంది ఉన్నారు ప్లాట్ ఫారం మీద ..కనబడే సమయానికి దాదాపు అయిదు వందలమంది అయారు ! ముందుగానే చెప్పారు ఈ రైలుకి చాలా మంది ఉంటారు అని ..రైలు భారీగా నిట్టూరుస్తూ ఆగింది ..అరుపులు కేకలు పరుగుల మధ్య నేను కూడా ఎక్కా...ఇదే మొదటి స్టాపు కావడంతో సీట్లు ఖాళీ గానే ఉన్నాయి ..నేనెక్కిన పెట్టె లో అందరూ ఇరవై ఏళ్ళకి మించని వాళ్లే ...నేను ఆలోచిస్తున్నా ..ఇక్కడ ఏ కాలేజి ఉందా అని ..."పొట్టోడా ,నత్తోడా రా?" అని నా పక్కనున్న కుర్రాడు తలుపు దగ్గరున్న వాళ్లని అడిగాడు..వాళ్లు ఇతనిని పట్టించుకోకుండా వాళ్ల కబుర్లలో ఉన్నారు." అబే ,నీయబ్బ రవిగా ఎవడొచ్చాడు అంటే చెప్పవేంది బే " -- "నీ మామ వచ్చాడు " అందరూ గట్టిగా నవ్వారు . "వాడైతే వాకే ..సట్టోడు అయితే అయిదు రూపాయలు బొక్క " అని నా పక్కనే కూచొన్నాడు ..చేతిలో పుస్తకాలు లేవు ..కానీ అన్నం కారియర్లు ఉన్నాయి అందరి దగ్గరా ..కాళ్లకి స్లిప్పర్లు ..దాదాపు అందరి చేతుల్లో రుమాళ్లు ..జేబులో దువ్వెన ... వీళ్లు చదువుకోడానికి రాలేదని అర్ధం అయింది ..." ఏ ఊరు " అని అడిగా ..."బోనకల్ సారు " అన్నాడు .. "మీదే ఊరు సారు ?" చెప్పా.."ఏం చేస్తారు మీరంతా " .."క్వారీ పనికి పోతాం సారు" .."చదువుకొన్నావా? " "పది పాసయి ఆపేసిన " "ఏం?" " పొలం పండలే ..అప్పులు చేసినం ..అక్క పెళ్లి చేసినం..తమ్ముడు చదువుతున్నాడు .. మా నాన్న ఒక్కడితో ఇళ్లు నడుస్తలేదు ..అందుకే ఈ పనికి పోతున్నా" .."ఎంతిస్తారు రోజుకి?" " ఇస్తారు ఎనభై దాకా ..ఎక్కువ బళ్లు నింపితే ఎక్కువొస్తది ..కానీ కష్టం అయితది " "పనిలో బూట్లు ఇవ్వరా?" " బూట్లా? " తల అడ్డంగా తిప్పాడు ..ఎప్పుడో చదివిన లెజిస్లేషన్ గుర్తొచ్చింది ..కాని అది వాడికి అర్ధం కాదని నాకర్ధం అయింది .."మరి ఇంకా చదివితే వేరే మంచి పని చేసుకోవచ్చు గా?" "అప్పటికి ఆ ఉన్న నాలుగెకరాలు కూడా అమ్మాలి సారు ..అప్పుడు అంత చదివి ఏ ఉద్యోగం రాక పోతే చేసుకోడానికి ఆ పొలం కూడా ఉండదు " నవ్వుతూ చిన్న విషయం లా తేల్చేసాడు ."ఒరేయ్ ..సట్టోడు కూడా ఉన్నాడు" తలుపు దగ్గర నుండి కేక ...మొహంలో మార్పు ..."థూ దీనవ్వ ..ఇప్పుడు వీడికి 10 బొక్క " గొణిగాడు ..."టికెట్ కొనలేదా?" " లేదు సార్ ..వచ్చే ఎనభై లో రాను పోను 10 పెట్టి టికెట్ కొంటే ఎట్ల సారు ...నెలకి మూడు వందలైతే తమ్ముడి స్కూలు కి ఫీజు కైనా ఉంటయి " "మరి పట్టుకొంటే?" " పట్టుకొంటే తలకి పది వసూలు చేస్తడు సార్ " అదేదో మామూలు విషయం అయినట్లు చెప్పాడు ..." వస్తుండారా? ఏ పెట్టి లో ఉన్నడు? " " రాలేదు లే బే ..ఊరికినే అన్నం.." "&****& &***& " బూతులు తిడుతూ తలుపు దగ్గరకి పోయి వాళ్లతో కలిసాడు ...బోనకల్ రాబోయే ముందు వచ్చి కారియర్ తీసుకొన్నాడు ..500 తీసి ఇవ్వబోయా ...అర్ధం కానట్లు చూసాడు ..."తీసుకో మీ తమ్ముడికి ఫీజు కట్టు " " వద్దు సార్ ..అట్ల తీసుకొనేటోడి నైతే ఇదే రైళ్ల అడుక్కొంటూ బతికేటోడిని గద ..పోతున్న సారు " అని తలుపు వైపు నడిచాడు ...