Sunday, February 25, 2007

బ్లాగరు కోసం ఒక టూల్‌ !!!

ఇవాళ ఓ రెండు గంటలు కూచొని " పద్మ లేఖిని" ని తయారు చేసా... నాగార్జున వెన్న గారిని అడిగి ఎప్పుడో సంపాయించిన జావా స్క్రిప్టు ఉపయోగించా .... ఈ టూలుతో తెలుగులో రాసి బటను నొక్కి బ్లాగరులో పోస్టు చేయొచ్చు ... ఇంకా చాలా మార్పులు చేసే అవకాశం ఉంది .. కాని సమయమే లేదు ... ఎవరికైనా ఓపిక ఉంటే సంప్రదించండి ... ఇదేమీ కష్టమయిన పని కూడా కాదు ...

Friday, February 23, 2007

జిందాతలిస్మాత్

నా చిన్నప్పుడు మా హిందీ మాస్టారు ఏదడిగినా ఒకటే సమాధానం చెప్తే ,జిందాతిలిస్మాత్ ప్రకటన చదివి నవ్వించేవారు ...ఇప్పుడు సరిగా గుర్తు లేదు కానీ , భలేగా నవ్వొచ్చేది ఆయన హిందీలో ఆపకుండా ; "తలనొప్పి ,పంటినొప్పి, దవడనొప్పి , కంటినొప్పి, కడుపునొప్పి , నడుంనొప్పి, ఇంకా ఏ నొప్పికైనా, వాడండి - జిందా తిలిస్మాత్ " - అని అరిస్తే ... ఆ వెనువెంటనే పడే బెత్తం దెబ్బలకి ఏడుపు కూడా వచ్చేదనుకోండి ...అది వేరే విషయం .. ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఏదడిగినా " నాకు తెలియకుండా జరిగింది " అంటూ ఉంటే నాకు జిందాతలిస్మాత్ గుర్తొచ్చింది

Friday, February 16, 2007

బ్రాహ్మీ ముహుర్తం

తెల్లారుజామున యోగా ,ధ్యానం చేస్తే బెమ్మాండమయిన ఆలోచనలొస్తాయని ప్రియతమ ముఖ్యమంత్రి సెలవిచ్చారు . దానర్ధం మిగతా వారందర్నీ ఆ పని చేయమనేమో ..ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఇట్టాంటి అమూల్యమయిన అభిప్రాయం వెలిబుచ్చారని గుర్తు ..ఆయనో అడుగు ముందుకేసి తమ్ముళ్లందరికి యోగా తరగతులు కూడా నిర్వహించిన గుర్తు ..ఏమో ఈ నాయకులు మాటలు చేతలు నిముషానికి ఒకటి ఉంటే ఎవడేమన్నాడో ఎవడికి గుర్తు ...పాపం ఆ బాధ నుండి తప్పించడానికేనేమో నువ్వు అది చేసావ్ , ఇది చేయలేదు అని ప్రస్తుతాలు మాజీలకి అనుక్షణం గుర్తు చేయడం..అంతేతప్పితే తామేంచేస్తామో ఎవడూ చెప్పేలా లేడు ..అన్నట్టు సదరు బ్రాహ్మీ ముహుర్తంలో వచ్చిన ఒకానొక బెమ్మాండమయిన ఆలోచన "ఇందిరమ్మ చెరువులు" అని ముఖ్యమంత్రిగారు సెలవిచ్చారు ..అప్పుడెప్పుడో బాబు గారు "నీరు - మీరు" అనో ఇంకేదో పేరుతోనో ఇట్టాంటిదే ఏదో పధకం దిగ్విజయంగా ( ఆయన దౄష్టి లో ) నిర్వహించినట్టున్నారే ..కాస్త కాస్త గుర్తొస్తుంది ..నే చెప్పలా వీళ్లు వాళ్లని గుర్తు చేస్తారని ..ఇంకో అధ్బుతమయిన ఆలోచన ..బొగ్గు ని విద్యుత్తు ఉత్పత్తి కి వాడాలని ...తద్వారా నీటి ని ఆదా చేయొచ్చని ..పనిలో పనిగా నల్లగా ఉండటం వలన బాబుకి బొగ్గు నచ్చలేదని చురక ..బొగ్గు అనేది ఒకసారి వాడితే మరలా మరలా భూమిలో తయారు కాదు ....కొన్నాళ్లకి బొగ్గు అడుక్కోవలసి రావడం ఖాయం ..కానీ నీరు అలా కాదేమో కదా ..ఆ మాత్రం ఆలోచన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి , బ్రహ్మీ ముహూర్తంలో , వచ్చి ఉండదా? ఏమో ఆయన అదికూడా ఆలోచించి ఉంటారేమో ..బుద్ది లేని , కాదు కాదు , విచక్షణ లేని వాళ్లం మనకేం తెలుసు ..

Thursday, February 08, 2007

త్యాగమూర్తులు

ఆ మధ్య దేశంలో కోట్లకి పడగలెత్తిన వారి జాబితా ఒకటి ప్రచురించారు ..గత పదేళ్లుగా ఆ జాబితాలో చేరేవారి సంఖ్య పెరుగుతూ వస్తుందని చదివి సంతోష పడ్డా .. వెనకబడ్డ దేశమో అని అరిగిపోయిన గ్రామఫోను ని పాడేసి కొత్త i-pod ( తెలుగు తర్జుమా చేయలేదు ఇంకా ఎవరూ) లో i-tune విన్నట్టనిపించిది ... కానీ ఇప్పుడనిపిస్తుంది ... త్యాగమూర్తుల జాబితా తయారు చేస్తే ఇంకా బావుండేదేమో అని ...మొదట మేడం సోనియా ..రెండు మన ప్రిఅయతమ ముఖ్యమంత్రి గారు .. డబ్బు సంపాయించడం ఏముంది ..కాస్త తెలివి , కష్టపడితే ఇవాల్టికి కాకపోతే ఎప్పుడో ఒకప్పుడు అ జాబితాలో చోటు సంపాయించొచ్చు ..కానీ సంపాయించిన దాన్ని ( ఎలా సంపాయించారు అన్నది పక్కన పెడితే) తౄణప్రాయంగా వదిలేయడం అనేది చాలా గొప్పది ..కష్టమయిందీనూ ..జాబితాలో మూడో స్థానం దక్కాల్సిన బొత్స బాబుకి ఆ అవకాశం కొద్దిలో తప్పిపోయింది ...