Thursday, September 25, 2014

నానమ్మ

" ఈ పాలి నువ్వొచ్చే సరికి నేనుంటనో ఉండనో బిడ్డా - చాన సంబరం గుంది నిన్ను,నీ బిడ్డని చూశాలకి " - వెళ్లిన ప్రతిసారి మేము వినే మాటలు . ఆ మాటలు ఇక వినలేము అని అనుకొన్న ప్రతిసారి ఒకరకమైన బాధ. నానమ్మ పడినబాధలతో పోలిస్తే అదోకపెద్దబాధ కాదని సరిపెట్టుకోవాలి.
నేను తనతో గడిపిన సమయం, తను బతికిన 100 సంవత్సరాలతో పోలిస్తే చాలా తక్కువ. నాకున్న 38 సంవత్సరాలలో తనకి ఇది కావాలని ఎవరినీ అడిగిన గుర్తు లేదు. అంతకు ముందు తాతని ఏమన్నా అడిగి ఉంటుందా అని ఎంత అలోచించినా ఏమీ తట్టడం లేదు. నాకే కాదు - అంత పెద్ద కుటుంబం లో ఎవరికీ తట్టక పోవచ్చు.
కళ్ళజోడు  మాటిమాటికీ తీసి తుడుచుకోడం చూసి - కనపడటం లేదా అని అడిగితే తప్ప - విషయం చెప్పని మొహమాటమో, ఎదుటి వాళ్లని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేని తనమో, లేక అడిగి లేదనిపించుకోవడం దేనికనే అభిమానమో అర్ధం కాదు.  ఇంతోటి 500 రూపాయల కళ్ళజోడు సరిచేయించానని 500 మందికంటే ఎక్కువ మందికే చెప్పి ఉంటుంది .  నా చిన్నప్పుడు ఊరు వెళ్ళిన ప్రతిసారి తను ఇచ్చిన 20 రూపాయలకంటే అది ఏ మాత్రం ఎక్కువ ? ఊరి నుండి మేము వచ్చాం అనగానే తను పడే హడావిడి అంతా ఇంతా కాకుండేది. ఎవడో ఒకడిని పిలిచి కొట్టుకి పంపి కోడి గుడ్డు తెప్పించి,  కూర వండి మాకు పెట్టి , తను మాత్రం జొన్నన్నం,  పచ్చడి తినేది  మా పిచ్చి నానమ్మ.
రెండే రెండు గదుల పూరింట్లో, ఉండీ ఉండని డబ్బులతో, 9 మంది పిల్లలని ఎలా పెంచిందో - ఇప్పటి వాళ్లకి ఊహకి అందని విషయం. పెంచడం మామూలుగా కాదు - అందరూ గౌరవప్రదమైన ఉద్యోగాలు, జీవితాలు అనుభవించే స్థాయికి వచ్చేలా పెంచడం.రెండు జతల బట్టలు - మనుషులంటే ప్రేమ , ఎవరినీ నొప్పించక పోవడం అనే రెండు గుణాలతో వందేళ్ళు బతికేసింది మా నానమ్మ .


రెండేళ్ళ క్రితం దీపావళి కి నా ఇంటికి వచ్చి దగ్గరుండి పండుగ చేయించింది. ఇల్లు అంతా తిరిగి చూసి ఎంత సంబర పడిందో - మనవడు పేద్ద మేడ కట్టుకు న్నాడని చాన  సంబరంగుంది నాయన అని చెంపలు నిమిరి చెప్పిన జ్ఞాపకం నాకే కాదు స్ప్పూర్తి కి కూడా గుర్తే ఉంది.
ఆ జ్ఞాపకాలు చాలు, మిగిలి పోతాయి నానమ్మా - నా మనవళ్ళ వరకూ .

2 comments:

Tulasi said...

Really awesome....
Great explanation about nanamma ( grand Mother ) i really love this.

by the way, guys i want you share one thing with you people i saw one you tube channel recently which published very interesting facts videos i love that
i hope you guys also like that have a visit on that https://www.youtube.com/garamchai

Unknown said...

nice blog
https://goo.gl/Yqzsxr
plz watch our vedio