చలం
చీకటి నీళ్ల మీద కమ్మేసిన సమయాన.తామరాకులు నీటి మీద పరచుకొని నిద్రపోతున్నాయి...గాలి వొచ్చి ఆకుల్ని ఒక మూల ఎత్తి పలకరిస్తే అలసి కళ్ళు మూతలు పడ్డ ప్రియురాలి వలె ప్రేమతో తప్పించుకొని మళ్లీ పడుకొంటున్నాయి అవి ...
ఉదయ సూర్యుడు నేర్పుగల ప్రియుడివలె యీ చెరువు మధ్య తామర మొగ్గల చివరల్ని కిరణపు కొనలతో తాకి, యెర్రబారేట్టు పులకరింప చేస్తున్నాడు ..
ఫాల్గుణ మాసపు మధ్యాహ్నం వేదిగా ఉన్నానా, చల్లగా ఉన్నానా అని సందేహించేసోమరి గాలి, విచ్చని మల్లెపూల పసి తెల్లదనం, వాటిలో దాక్కుని నిద్రబోతూఉన్న పరిమళాన్ని సూచించే పచ్చి వాసన గిన్నెలో నీళ్ల చల్లదనం...
.
ఎండాకాలపు దక్షిణగాలి, తెల్లారకట్ట అలసటనిద్ర,కోవిల అరుపు- లేవ వద్దనే ప్రియురాలి గట్టి కౌగిలి , మల్లెపూల పరిమళం --అన్నీ ఒకటిగా కలిసి జ్ణాపకం వస్తాయి--లోకం సారవిహీనమని అధైర్య పడినప్పుడల్లా.
అందమైన ఉదయం, పెద్ద చెట్లు ఆకాశం కనపడకుండా రోడ్డు పక్కనీచి నెత్తి మీద కలుసుకోడం చేత వాటి ఆకుల్లోంచి లోపలికి వచ్చే కాంతి రకరకాల రంగులతో కళ్లకి శాంతినిస్తోంది ...
భూమిని, సూర్యుడు కాల్చిన స్థలాల,మానవుడు తవ్విన ప్రదేశాల, గాయాల్ని యీ కొత్త పచ్చగడ్డి కప్పి వోదార్చింది.ఈ వానలకి ఎడారిలాగైపోయిన యీ సీమ కొత్త అందాలతో కలకల లాడుతోంది .చివరికి యీ బురద తాలూకా కూడా, ఏమీ ఆకర్షణ లేదనుకొన్న భార్య ఒక రోజు ఆకుపచ్చ చీర కట్టుకొని ఎన్నడూ లేని శ్రుంగారాన్ని ఎరువు తెచ్చుకున్నట్టుంది...
---- మ్యూజింగ్స్ నుండి