Friday, July 29, 2005

తాపీగా ...

రాత్రి 1.30 కి ఫోన్ మోగింది .అదిరిపడి లేచి ఫోన్ ఎత్తా .
"హలో నేను నాగేశ్వరరావు ని " మరోసారి గుండె అదిరింది ..నాకు వెంటనే గుర్తొచ్చిన నాగేశ్వరరావు మా అక్క మామగారు .ఈయన ఈ సమయంలో ఎందుకు చేసి లేపుతున్నాడబ్బా అనుకొంటుండుగానే"నేను రా నాగేశ్వరరావు ని మణుగూరు నుండి " అన్నాడు ..మణుగూరు నాగేశ్వరరావు అంటే నా మాజీ మానేజరు గుర్తొచ్చాడు ..కానీ ఆయనకి నన్ను అరే ఒరే అనేంత చనువు లేదు ..అప్పుడు వెలిగింది ..వీడు" నామ్ "అని ..ఆ కాలేజి పుణ్యమా అని మేము ఇంటి పేర్లతోనే అందరికి బాగా గుర్తుంటాం ..ఇలా అర్ధరాత్రిళ్లు ఇబ్బంది కలిగినా ఒకోసారి అది తన్నులు తినకుండా కాపాడేది ..ఓసారి ఓ రౌడీ గ్యాంగు లో ఒకడు నాతో చిన్నప్పుడు చదివిన పరిచయంతో సుధీర్ అనేవాడు ఎలా ఉంటాడు , ఏ టైమ్ లో వస్తాడు అని కూపీ లాగడానికి అడిగాడు ..నేను "అన్నా మిమ్మల్ని ఎవడో బోల్తా కొట్టించాడు ..అసలు సుధీర్ అనేవాడు మా కాలేజి మొత్తంలోనే లేడు" అని నమ్మకంగా చెప్పా..వాడికి నామీదున్న అపార నమ్మకంతో నమ్మేసాడు ..విషయం ఏంటంటే నాకూ సుధీర్ పేరు సుధీర్ అని గుర్తు లేదు ఆ సమయానికి ..వాడి పేరు "కట్ల " మా కాలేజి కి సంబంధించినంత వరకూ ..సరే ప్రస్తుతంలోకి వస్తే ...ఈ నామ్ అని పిలవబడే నామవరపు నాగేశ్వరరావూ నేను కలిసి నాలుగేళ్లు చదివి ,ఒక ఏడాది పని చేసాం ..పని అంటే మళ్లీ కొన్ని గుర్తొస్తాయి .. వీడి కి ఖంగారు ఎక్కువ ..మొదటి రోజు నేను , నామ్ , కెపి ముగ్గురం జాయినింగ్ రిపోర్టు ఇవ్వడానికి వెళ్ళాం..కెపి ఎవరో తెలిసిన వాళ్ళు కనపడితే మాట్లాడుతున్నాడు ...అక్కడకి రావడానికి ముందే మాకు ఒక విషయం తెలుసు ..అక్కడ మాలో ఒకరిని షిఫ్ట్ ల్లో వేస్తారు అని ..ఉద్యోగం వచ్చీ రాగానే షిఫ్ట్ లలో పని చేయడం అంటే పెద్ద చిరాకు ..ముగ్గురికీ మనసులో పక్క వాడిని వేస్తే బావుండు అని ఉంది ..కానీ బయట పడటం లేదు అంతే ...కెపి వస్తే ముగ్గురం కలిసి వెళదాం అని మానేజరు, పైన చెప్పిన ఇంకో నాగేశ్వరరావ్, గది ముందు ఆగాం..అటు తిరిగి మళ్ళీ ఇటు తిరిగే సరికి నామ్ మాయమయ్యాడు ..ఎక్కడ పోయాడబ్బా అని చుట్టూ చూస్తున్నా ..పది నిముషాల్లో కెపి మాటలాపి వచ్చాడు .."వీడేడి రా " అన్నాడు .."ఏమో రా బొగ్గులో కలిసి పోయాడంటావా " అని నవ్వుకొన్నాం ..ఇంకో పదినిముషాలు చూసి సరే మనం పోదాం పద అని తలుపు తీయబోతుంటే , లోపల నుండి బిక్క మొఖంతో నామ్ వచ్చాడు బయటికి ...ఏమయింది అని అడగబోయి మానేజరు మా వైపే చూస్తుండటం తో లోపలకి వెళ్లిపోయాం ..మా ఇద్దరిని రేపటి నుండి జనరల్ షిఫ్ట్ లో రమ్మని ఆ రోజుకి వెళ్లిపోమన్నాడు మానేజర్ ..విషయం అర్ధమయ్యి నవ్వుకోలేక చచ్చాం ..నామ్ మాకన్నా ముందు వెళ్ళి మానేజరు ని మంచి చేసుకొని జనరల్ షిఫ్ట్ లో వేయించు కొందాం అని మాకు చెప్పకుండా మాయమయ్యాడు ..తీరా లోపలకి వెళ్లే సరికి నైట్ షిఫ్ట్ లో మనిషి తక్కువగా ఉన్నారు అని వేడి వేడి గా చర్చ జరుగుతుందట ..ఇకనేం సమస్యకి నామ్ ని పరిష్కారం చేసారు ..ఆ రోజంతా పాపం నామ్ ని ఏడిపిస్తూనే ఉన్నాం .. నైట్ షిఫ్ట్ ఇంచార్జ్ అయినందుకు పార్టీ కూడా పుచ్చుకొన్నాం ..మేము ఇవ్వాల్సింది పార్టీ :) ...తెల్లారి మేము జనరల్ షిఫ్ట్ లో పనేమీ చేయకుండా కాలం గడిపితే నామ్ నిద్ర పోడానికి కష్టపడ్డాడు ..మందు కొట్టి మరీ ...రెండో రోజు ఆఫీసు కి వెళ్లేసరికి హడావిడి గా ఉంది ..రాత్రి ఒక ప్రమాదం లో ఒకరు చనిపోయారు... పని బందు ..ఎవరినీ కదిలించేలా లేదు . విషయం నామ్ కి సరిగ్గా తెలుస్తుంది కదా అని వాడి కోసం వెదికితే ఎక్కడాలేడు ..ఆరా తీస్తే హీరో రాత్రి వచ్చిన గంటా రెండు గంటలకే నిద్రకి ఆగలేక రూమ్ కి వెళ్లిపోయాడంట ..పోయి వాడి రూమ్ తలుపులు బాది లేపాం ..కెపి చాలా సీరియస్ గా నిన్ను జియం రమ్మంటున్నాడు అని చెప్పాడు .."దేనికి ?" ఖంగారు గా అడిగాడు .."రాత్రి ఆక్సిడెంట్ అయింది ..ఒకరు చనిపోయారు ..షిఫ్ట్ ఇంచార్జ్ నువ్వే కదా అక్కడ ఎగిరి పడుతున్నాడు "అని చెప్పాడు .."అయినా ఒక వారం రోజులు సిన్సియర్ గా పని చేయొచ్చు కదా" అని చిరాకు మొహంతో అడిగేసరికి నామ్ కి ఇంకా ఖంగారు ఎక్కువ అయింది ..భయంలో బుర్ర పని చేయదు అనేది నిజం ..నిజానికి మేము ఇంకా ట్రైనీలమే కాబట్టి మాకేం సంబంధం ఉండదు ..కానీ వాడు నామ్ ,పైగా భయం లో ఉన్నాడు ..గబ గబా లేచి తయారయ్యి "సరే రా ఆఫీస్ కి వెళ్తా " అని వెళ్లాడు ..వాడిని వెళ్ళనిచ్చి మేము ఆఫీస్ కి ఫోన్ చేసి అక్కడ రాజు కి చెప్పాం ...వీడు ఖంగారు లో పెద్దాయన్ని కలిసి ఏం చెప్తాడో ..ముందే ఆపేయమని ...మేము పని లేదని పత్తాల ఆటలో పడ్డాం ..దాదాపు రెండు గంటల తరువాత రాజు కూడా వచ్చాడు .."నామ్ ఏమంటున్నాడన్నా?" అని నవ్వుతూ అడిగాం "ఏడిరా భాయ్ ? వస్తడన్నరు ..రాలేకద?" అన్నాడు .."కొంపతీసి పెద్దాయన దగ్గర పోయాడా?" అన్నాం "ఎహె లేదురా భాయ్ ..అసల్ వాడాపక్కకే రాకుంటే?" అన్నాడు .. మరి వీడు ఎక్కడకి పోయుంటాడు? టిఫిన్ చేయడానికి ఏమన్నా పోయాడేమో అని మేము ఆటలో పడ్డాం ..ఆ సాయత్రం మూడు సమయంలో కెపి రూమ్ లో బాతాఖానీ వేస్తుంటే కెపి ఫోన్ మోగింది .."నేనే కెపి ని ...సామురాయా? మా ఇద్దరివీ ఇక్కడే ఉన్నాయే.. నా నంబరా? " అంటూ మాట్లాడుతూ నా వైపు అయోమయంగా చూస్తున్నాడు ..అయిదు నిముషాల్లో ఫోన్ పెట్టేసాడు ..ఎవరు రా అంటే పోలీసు లు అన్నాడు ..అర్ధం కానట్టు మొహం పెట్టా .."ఖమ్మం రోడ్దులో సుజుకి సమురాయ్ కి ఆక్సిడెంటు అయిందట ..బండి నడిపే అతను స్ప్రుహలో లేడట ..అతని జేబులో నా ఫోన్ నంబరు ,పేరు ఊరు ఉన్నాయట "అన్నాడు ..మీ చుట్టమేమో అన్నా ..లేదు మామా మా చుట్టాల్లో ఎవరికీ సమురాయ్ లేదు అన్నాడు ..పోనీ ఫ్రెండ్స్ ? అన్నా ..ఫ్రెండ్స్ లో నీకు ఉంది కానీ నువ్వు నా ఎదురుగానే ఉన్నా..సగంలో ఆపేసాడు.. మిగతా సగం ఇద్దరి నోట్లో నుండి ఒకేసారి వచ్చింది "నామ్" ..వాడు కూడా పోయిన నెలలోనే కొన్నాడు ..పైగా పొద్దున నుండి వాడు మాయం ...హడావిడి గా బండి తీసాం ..కానీ అరకిలోమీటరు వెళ్ళాక అనుమానం వచ్చింది .ఓ సారి నామ్ రూం కి వెళ్లి చూద్దాం అని అటు తిప్పాం ..అక్కడ వాచ్ మాన్ ని అడిగితే "ఆ సారు ఇవాళ మొత్తం కనపడలేదు సార్" అన్నాడు ..వీడు ఎప్పుడూ మత్తులోనే ఉంటాడు అని నామ్ రోజూ వెళ్ళే కొట్లు అన్నిటి దగ్గరా అడిగి చూసాం ..ఎవరికన్నా కనపడ్డాడేమో అని ...ఎవరూ చూడలేదు అన్నారు ...ఇలా కాదని బయలు దేరాం ..ఊరు దాటుటూ ఉండగా నామ్ వాళ్ల ఊరివాడు అటునుండి వస్తూ కనపడ్డాడు ..విషయం చెప్పి గానే "నాకు మధ్యాహ్నం పాలవంచ దగ్గర ఎదురయ్యాడు ..కానీ నేనూ ఆగలేదు తనూ ఆగలేదు "..అని చెప్పాడు ...అనుమానం కొద్ది కొద్దిగా బలపడుతూ ఉంది ..నామ్ వాళ్ల ఇంటికి ఫోన్ చేద్దాం అంటే వాళ్లకి ఫోన్ లేదు ..అప్పుడు ఆయన అన్నాడు ..వాళ్ల ఇంటి దగ్గర మెడికల్ షాపు ఉంది ..వాళ్లకి చేసి పిలిపిద్దాం అని ..చేసి వాళ్ల తమ్ముడిని పిలిపించాం ..మీ అన్న ఇంటికి వచ్చాడా అని అడిగితే వాడు మా అన్న ఇప్పుడు ఇంటికి ఎందుకు వస్తాడు అని ఎదురు ప్రశ్న వేసి మా అనుమానాన్ని మరికాస్త పెంచాడు ...కిం కర్తవ్యం అని ఆలోచిస్తుంటే రాజు అటువేపు వచ్చాడు ..విషయం ఇది అని చెప్తే ..సరే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కనుక్కొందాం , ఎస్సై మనకి తెలుసు అని తీసుకెళ్లాడు ..అక్కడ నుండి జిల్లాలో దాదాపు అన్ని పోలీసు స్టేషన్ లకి సమాచారం ఇచ్చారు ..ఇవాళ ఏ పోలీసు స్టేషన్ పరిధిలో అయినా సుజుకి సమురాయ్ ఆక్సిడెంట్ కేసు నమోదు అయిందా అని ..రెండు గంటల్లో అన్ని పోలీసు స్టేషన్ ల నుండి జవాబు వచ్చింది ..ఎక్కడా అలాటి కేసు రాలేదని ....కొంతలో కొంత నయం ..కానీ మనసులో పీకుతూనే ఉంది.. ఈ పోలీసులని ఎవడు నమ్మొచ్చాడు అని ..మా కళ్ళ ముందే వాళ్లు చేయగలిగింది చేస్తుంటే చూస్తూ కూడా..విషయం మెల్లగా ఊరంతా పాకింది ..పేపరోడు వివరాలు చెప్పమని ..మా ఆఫీసు లో కండొలెన్సు లకి సన్నాహాలు ...రాత్రంతా టీలు ...ఆలోచనలు ..గుర్తుకి తెచ్చుకోడాలు ..ఎప్పటికో తెల్లారు ఝామున నిద్ర పోయాం రాక పోయినా ..పొద్దున్నే ఫోన్ మోగింది ..కెపి ఎత్తి ఒక్క నిముషం ఆగి బూతులు తిడుతున్నాడు అవతల మనిషి ని ..తిట్ల ప్రవాహం ఆపి ఫోన్ పెట్టేసాడు .."వాడు వాళ్ల మామ కూతురితో మస్తు గా ఎంజాయ్ చేసిండంట రాత్రంతా ..ఇంటికి పోలే ..కాబోయే మామ ఇంటికి పోయాడట " కోపంగా చెప్పాడు మళ్లీ ముసుగు తంతూ ...
అద్గదీ ఆ నామ్ ఇప్పుడు ఫోన్ చేసాడు ..అంత దూరం నుండి ..."ఏంట్రా విషయం?" "ఏంలే సెల్ కొన్నా ..మొన్న రాజు కలిస్తే నీ నంబరు తీసుకొన్నా ..ఊరికే చేసా" కెపి ఆరోజు తిట్టిన దానికన్నా ఎక్కువ తిట్టేవాడిని ..కాని నిద్ర ముంచుకొస్తూ ఉంది ..రేపు చేస్తా పెట్టేయి అని పెట్టేయించి పడుకొన్నా ...

Saturday, July 23, 2005

టూకీగా

కొత్త టాలీవుడ్ ఫార్ములా :
మూడు హాలీవుడ్ సినిమాలు = ఒక తెలుగు సినిమా

Sunday, July 17, 2005

tagged

కిరణ్ నన్ను tag చేసాడు ...ఆ ముక్క పక్కా తెలుగులో ఎలా రాయాలో తెలియలేదు ..దాదాపు 4 రకాలుగా మొదలెట్టి చివరికి ఇంగ్లీషు లో రాసా... విషయంలోకి వస్తే ...ప్రస్తుతం నా దగ్గర ఉన్న పుస్తకాల సంఖ్య --చలం మొత్తం పుస్తకాలు ..దాదాపు ఓ 50 ఉంటాయి ..అవి తప్ప మిగతావి ఏమీ లేవు ..ప్రస్తుతం చదువుతున్న పుస్తకం ఇక్కడ ప్రస్తావించ వచ్చో లేదో తెలియదు ..ఎంచేతంటే అది technical book .. దానికన్నా ముందు చదివినది "Winning" by Jack Welch ... నచ్చిన పుస్తకాలు చాలా ఉన్నాయి ..ఒక్కో రకానికి ఒక్కోటి చొప్పున చెప్పినా చాలా అవుతాయి ..నాకు నచ్చేవి జీవిత చరిత్రలు ..వాటిల్లో బాగా నచ్చింది ...గాంధీ ది ...గాంధీ ఒక నాయకుడి లా నచ్చక పోయినా ఒక మనిషిగా నచ్చుతాడు ..ఈ మధ్య కాలం లో చదివిన వాటిల్లో న చ్చింది ...మళ్లీ ఇదో కష్టమయిన ప్రశ్న :( ..ఝుంపా లహిరి రాసిన "The Namesake" ఏక బిగిన చదివేసా..అంత బాగా రాసింది ..
ఇప్పుడు ఓ అయిదుగురుని tag చేయమన్నాడు ...ఈ బ్లాగు చదివేది అయిదుగురే (అయిదుగురు లో కిరణ్ పోను నలుగురు :D)అని నా గట్టి నమ్మకం :) అంచేత ఓ నలుగురు పాఠకుల్లారా మీ మీ బ్లాగుల్లో మీకు నచ్చిన మెచ్చిన తెచ్చిన పుస్తకాల గురించి రాయండి ...

Saturday, July 16, 2005

Thursday, July 14, 2005

టూకీగా

పదకొండు కోట్ల కుంభకోణానికి కాబోయే ఖర్చు 100 కోట్లు ...
అవెక్కడ మాయమయ్యాయో తెలియడానికి పట్టే సమయం దాదాపు 11 ఏళ్లు ...

Monday, July 11, 2005

టూకీగా ...

"మీరు ఇంత సాధించారు జీవితంలో ..ఆ ఆనందం పంచుకోడానికి ఎవరూ లేరు "అని ఎప్పుడూ అనిపించలేదా?
"నేను సాధించిన దాన్ని గురించి గొప్పగా గానీ , ఆనందం గా గానీ నేనెప్పుడు feel అవలేదు ..మొన్నా మధ్య నాకు బెంగాల్ లో ---- (అవార్డు ) ఇచ్చారు ..అది మొత్తం దక్షిణ భారత దేశం లో "ముగ్గురికే "( ఒత్తి పలుకుతూ) ఇచ్చారు ...కానీ నేను అదేదో గొప్పగా భావించడం లేదు "
--- ఒక గొప్ప రచయిత్రి

Sunday, July 10, 2005

టూకీగా...

"పోరి కత్తి ఉంది మామా" - ఒంటరిగాడు
" ఆ అమ్మాయి చాలా బావుంటుంది " - సంసారిగా మారాక

Friday, July 08, 2005

టూకీగా ...

మాటలతో సమయమే తెలిసేది కాదు వాళ్లిద్దరికీ ఒకప్పుడు
ఒకరి పుట్టిన రోజు ఒకరికి ఏ యాహూ క్యాలెండరో గుర్తు చేయాల్సి వస్తుందిప్పుడు

Thursday, July 07, 2005

టూకీగా ...

బయట వాళ్లు ఆయన్ని చేతగాని వాడు అన్నప్పుడు వాళ్ల మీద అరుస్తుంది ఆవిడ ..
ఇంట్లో వివరం సవరం లేని పనులు చేస్తాడు అని ఆయన్ని అరిచేదీ ఆవిడే...

Tuesday, July 05, 2005

టూకీగా 3...

"నేనంటే నీకు ఎంత ఇష్టం"
"చాలా"
"చాలా అంటే ఎంత? "
"ఇంంంంత"
తెల్లారింది...అరుచుకోడాలు ,చిరాకులు , ఏడుపులు , కోపాలు ...మామూలే