Sunday, March 06, 2005

తాత

తాతయ్యా,
వారం రోజులుగా చేయాలి చేయాలి అనుకొంటూ ఇవాళ ఫోన్ చేసా నీకు ...నాకు తెలుసు నువ్వు మాట్లాడవని...నాకు తెలుసు నీకు నాతో మాట్లాడాలంటే ఇష్టం ఉండదని ...కానీ నువ్వు చెప్పిందే కదా మనకి కష్టంగా ఉన్నా కొన్ని పనులు చేయక తప్పదని ...నువ్వు మాట్లాడనప్పుడు అక్కడ నేను మాట్లాడటానికి ఎవరూ ఉండరని, ఉన్నా వాళ్లతో మాట్లాడటానికి ఏమీ ఉండదని నాకూ తెలుసు ...నీకూ తెలుసు ...నీకు కోపం ఉండటంలో న్యాయం ఉంది.. నీకు నా మీద కన్నా నీమీదే ఎక్కువ కోపం అని నాకు తెలుసు.. నీకంటూ ఎవరూ లేకుండా అయిపొయారని నీకు బాధ .. నీ రెక్కల కష్టంతో పైకొచ్చిన అందరికీ రెక్కలొచ్చి ఎగిరిపోయారని నీకు చాలా బాధ...నీకు తల కొరివి పెట్టాల్సిన కొడుక్కి నీ చేత్తో నువ్వు పెట్టాల్సి రావడం భరించలేని బాధ ..కానీ బాధని ఎప్పుడూ ఎదుటి వారికి చూపించొద్దు అని చెప్పే నువ్వు అది మాకు చూపించకుండా ఉంటానికి ఎంచుకొన్న మార్గం మాతో మాటాడక పోడం...నువ్వు మాటాడక పోయినా నీ బాధ నాకు తెలుస్తుంది తాతా ..అది నువ్వు నాకు నేర్పిన అనేకానేకాల్లో ఒకటి ..నేను నిన్ను మరచిపోయా , పట్టించు కోడంలేదు అనుకొంటున్నావా తాతా? నీకు మిగిలిన కొడుకుతో పాటు నన్ను కూడా వాళ్ళతో జమకట్టేసావా? అయినా పర్లేదు ..ఎదుటి వాళ్ళు మనని ఎలా అయినా అర్ధం చేసుకొనే స్వేచ్చ వాళ్లకి ఉంది అని నువ్వేగా నాకు చెప్పేవాడివి ..ఆ స్వేచ్చ నీకు కూడా ఉందిలే ... నాకు అన్ని గుర్తే ఉన్నాయి తాతా...నా చిన్నప్పుడు మా అమ్మ నన్ను కొట్టిందని నన్ను దత్తత తీసుకోడానికి నువ్వు చేసిన గొడవ ...ఇంట్లో అందరు ఎవరి పనుల్లో వాళ్ళుండి నన్ను పట్టించుకోక పోతే , పొలం నుండి వచ్చిన నువ్వు , ఏ మాత్రం విసుక్కోకుండా నా ముడ్డి కడగడం...నాకు ఇష్టమని భూక్యా గాడిని పనులన్ని మానిపించి వాడి నెత్తిన నన్ను మోసే పని వాడికి అప్పజెప్పడం ...నాకు నత్తి పోడానికి తేనె కోసం అడవంతా తిరిగి తేనెపట్లు తెప్పించడం...పొద్దు పొద్దున్నే మూడున్నరకి నువ్వు లేచి , అందరు పని వాళ్లు ఉన్నా , పొలికట్టె పట్టుకొని ఊడవటం ... ఒక్కొక్క ఆవుకు ఒక్కో పేరు పెట్టి మా చేత వాటిని పిలిపించడం ... ఆవు దూడకి , నాకూ "బుజ్జిగాడు" అనే పేరే పెడితే నేను గొడవ చేయడం ...
ఎలా మర్చిపోతా అనుకొన్నావ్ అవన్నీ?నన్ను నీ వెంటేసుకొని ఇంటి చుట్టూ తిరిగి మనం నాటిన తాటి చెట్లని చూడు ఓ సారి ...అవి పెరిగే దెప్పుడు , ఆ కల్లు మనిద్దరం కలిసి తాగేదెప్పుడు అని అడిగే నేను కనపడటం లేదూ? ఒకసారి తల పైకెత్తి ,ఎర్రటి ఎండలో మామతో కలిసి , పైకెక్కి నేను కొట్టిన రీపరు ని చూడు ..బొబ్బలెక్కిన చేతులకి నీతో నూనె రాయించుకొనే పండు గాడు కనపడటం లా? ఎండాకాలం లో ఒక్కసారి ఇంటి వెనుక ఉన్న చింత చెట్ల వైపు వెళ్లు ...నేను తగలేసిన గడ్డి వాము ఆనవాళ్ళు లేవూ అక్కడ? ఇంక నేను నిన్ను నువ్వు నన్ను మరచిపోడం ఏంటి?

ఇప్పుడే కాదు తాతా ఎప్పటికీ అది సాధ్యం కాదు .. నువ్వు నీ ఆఖరు దశలో ఉన్నావన్న విషయం రాత్రి నాకు అమ్మమ్మ చెప్పిన దాన్ని బట్టి అర్ధం అయింది ...నువ్వు ఇంకొన్నాళ్ళే ఉంటావన్న నిజం నీకూ తెలుసు ...నాకూ తెలుసు ..అయినా నాకు బాధ అనిపించడం లేదు ...ఎందుకో తెలుసా? నీకూ నాకూ చావులు బాధ లు కలిగించడం మానేసాయి ..నీకు నీ పెద్దకొడుకు , నాకేమో నీ చిన్న కొడుకు ..వాళ్లిద్దరూ మనని వదిలేసి వెళ్లి పోయి .. ఒక మనిషి మనతో లేక పోయినా మనం మాములుగానే బతకగలం అని చూపించారు ...మన ఇంట్లో ప్రస్తుతం ఎందరికి వాళ్లు ఏ రోజు పోయారో గుర్తుంది? అందుకే నాకు నువ్వు పోతావ్ అన్నా బాధ కలగడం లేదు...అయినా నువ్వ్ పోవచ్చు కాని నీ గురించిన ఆ ఙాపకాలు ఎక్కడికి పోతాయి?

2 comments:

Anonymous said...

bhada ledu antune, chachipoyina tedhilu evaru gurthuleduantunnaru antunnav kada. mari ni bhada bhada kaada...
mi tatayya lanti tata naakunte bagunnu anipinchindhi..

Anonymous said...

chava garu.. meeru nannu eppudu disappoint cheyyaru mee baavalu express cheyyadam lo. :)

mimmalni direct gaa kalise adrustam devudu ichinanduku chaala santhosha padutunna.. alane mee lanti vaallaku dooram ayyanu ani chintistunna rojulu vunnayi. kaani naaku mee meeda vunna aa gourvam, nammakam eppudu poledu.

itlu oka mitrudu. :)