Thursday, December 16, 2021

టూకీగా

ప్రస్తుత కాలంలో బాగా నడిచే అవకాశం ఉన్న వ్యాపారం?

నాయకులకి గోడ దూకడంలో శిక్షణ !!!! 
రాష్ట్రల మధ్య పోటీ పెడితే -  గోవా కి  ప్రధమ స్థానం .
ఉత్తమ మోటివేటర్  / శిక్షకుడు - రాహుల్ గాంధీ  ?


Tuesday, May 25, 2021

కాశయ్య గారు.

 "నాకొక నికార్సయిన రాజకీయ నాయకుడు తెలుసు " - ప్రస్తుత కాలం లో  ఇదేదో వినకూడని మాటేదో విన్నట్టు ఉంది కదా?  కాని నేను అలాంటి నాయకున్ని పలుసార్లు కలవడం, జీవితానికి సరిపోయే విషయాలు తెలుసుకోవడం 15 రోజుల క్రితం వరకు జరిగింది. ఆయనే చేకూరి కాశయ్య గారు.

ఆయనతో మాట్లాడితే అన్నీ పనికొచ్చె విషయాలే. మన సమయం విలువ మనకంటే బాగా ఆయనకే తెలుసేమో అనిపిస్తుంది. మనకి వినాలని ఉన్నా, "రైట్-  ఇక  బయలు దేరండి "అని వినేవాడి సమయం వృదా చేయకూడదని  పంపేసే  మనిషిని, నేనైతే, తననే చూడడం. 

"చేకూరి కాశయ్య గారికే మన ఓటు " - నాకు గుర్తు ఉండి సత్తుపల్లిలో గోడలమీద ఆయన పేరు పరిచయం. మణుగూరు లో ఆయన కుటుంబం సభ్యులతో దగ్గర పరిచయం ఉన్నప్పటికీ ఆయనని కలవడం మాత్రం అక్క పెళ్లి లో మాత్రమే. నాన్న రిటైర్మెంట్ రోజు ఆయనతో ఒక గంట గడిపే అవకాశం వచ్చింది.  మొదటి సారి ఆయన ఎలా ఆలోచిస్తారో కాస్త అనుభవం అయింది ఆరోజే. ఎక్కువ సమయం ఆయనతో గడపడం మాత్రం నేను అమెరికా నుండి వెనక్కు వచ్చినప్పటి నుండే. చెప్పడానికి బాధగా ఉన్నా, ఆయన అనారోగ్యం ఆ అవకాశాన్ని నాకు కల్పించింది. చికిత్స కోసం హైదరాబాదు వచ్చినప్పుడల్లా కలవడానికి ప్రయత్నించేవాళ్ళం. "దీప వచ్చింది " అనగానే "శరత్ కూడా వచ్చాడా " అన్నప్పుడల్లా కొంత గర్వం నాలో . 

కలిసినప్పుడల్లా , కలిసిన వారినందరిని ఎంతో ఆప్యాయం గా పలకరించడం ఆయనకే సాధ్యం. కొన్ని లక్షల మనుషులను గుర్తుపెట్టుకొని, వారి ప్రస్తావన వచ్చినప్పుడు వారిలో ఉన్న మంచిని మాత్రమే ప్రస్తావించడం ఆయనకీ మాత్రమే సాధ్యమైన మరో గొప్ప లక్షణం . చిన్న పిల్లలనుండి , ప్రధానమంత్రులుగా పనిచేసిన వారి వరకు , ఎవరి గురించి అయినా ఆయన ధోరణి అలానే ఉండేది. 

ఆయనకి నచ్చక పోవడం అనే లక్షణం లేదు. ధన, వస్తు , సౌఖ్యాల మీద మోజు లేదు. గాంధేయ వాదం అనొచ్చో లేదో కానీ - అటు ఇటుగా గాంధీ గారి లాగే ఉండేవారు. తినే తిండి, కట్టే బట్ట , మనుషులమీద ప్రేమ - పుస్తకాలలో గాంధీ గారి గురించి చదివాము కానీ , కాశయ్య గారిలో చూసాం. "గాంధి " - ఆ మాట వినగానే ఆయన మోహంలో అదొక రకమైన వెలుగు. అంతటి సౌమ్యుడికి కోపం తెప్పించగలిగిన ఘనుడిని అవ్వగలిగా అనుకొంటా  :( "గాంధీ" - చివర "గారు" చేర్చలేదని - క్షణకాలం ఆయన మోహంలో కొంత అలజడి -" "గారు" అంటే మనకి వచ్చే నష్టము ఏమి లేదు కదా శ రత్ " - అని సంభాషణ ఆపేసారు. 

ఆయన అవసరాలు మితం - మిత్రులు అపరిమితం.  flavored yogurt,  ఆవకాయ, దబ్బకాయ పచ్చడులు, టమాటో సూప్ మాకు తెలిసి ఆయన ఇష్టంగా తినేవి. రెండు చపాతి , దాల్ తడకా చాలు  ఆయన భోజనానికి . రెండు జతల ఖద్దరు బట్టలు , భుజాన కండువా , కాళ్ళకి చెప్పులు , కంటికి జోడు ఉంటే చాలు ఆయన ఎక్కడకంటే అక్కడకి వెళ్ళడానికి . పిలిస్తే పలకడానికి ఉన్న లక్షల మంది ఆయన సంపాదించిన ఆస్తి. ఇంట్లో వాళ్లకి సహాయం చేస్తే, అందరి నాయకులకి తనకి తేడా ఏమిటి అనుకొనేరకం ఆయన. 

"ఉన్నదంతా మనిషి బుర్రలోనే , బయట ఉన్నది మన మెదడు సృష్టే " అని నమ్మేవారు కనుకనే అంత  నిస్వార్ధం గా, నిరాడంబరంగా ఉండగలిగారు. కండ్లు కనపడక పోయినా అదే చిరునవ్వుతో ఎలా ఉండగలిగారో అనుకునేలోపు - " నా Positivity నే నా Secret శరత్ " అని  చె ప్పే శారు. తనని కలిసిన సమయంలో ఎదుటి వ్యక్తిలోని మనిషి ని బయటకు తీయించగలగడం ఆయన ప్రత్యేకత.  స్నేహం ఆయన అమితం గా కోరుకొనేది. ఆయనతో ఒకసారి మాట్లాడితే మర్చిపోవడం కష్టం. అలాంటిది కొన్ని రోజులు దగ్గరగా ఉండగలగడం ఒక అరుదైన అవకాశం. కొల్లాయి కట్టిన గాంధీ నుండి ,  గులాబీ కప్పిన కేసీఆర్ వరకు - ఊర్లో కుమ్మరి నుండి , work from home చేస్తున్న కంప్యూటర్ ఇంజనీర్ వరకు - అనేక విషయాలు- ఆయన తో మాట్లాడినవి  . అవన్నీ రాయడం అయ్యేపని కాదు. 

వారి అబ్బాయితో అన్నట్టు - మనిషి మాత్రమే పోయారు, నేర్పిన విలువలు, జ్ఞాపకాలు కాదు. 

                                                                    _^_

Sunday, March 31, 2019

పదేళ్లలో సాధించిన ప్రగతి

జలయజ్ఞం ద్వారా హరితాంధ్రప్రదేశ్ గా అవతరించాల్సిన రాష్ట్రం బంగారు తెలంగాణా మరియు స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా విడదీయబడింది.
సదరు రాష్ట్రాల వద్దనున్న "బంగారానికి" కాపలాదారుగా మరొకరికి అవకాశం ఇవ్వడం ప్రియతమ ప్రధానికి నచ్చక ఆయనే స్వయం గా ఆ పనిలో క్షణం ఖాళి లేకుండా పని చేస్తున్నారు. ప్రజలందరి దగ్గర సంపద ఉంటే కాపలా కి కష్టం కాబట్టి , నోట్ల రద్దు ద్వారా  సదరు సొమ్ములు వెనక్కి తీసుకొని , ఎవరికి ఎంత అవసరమో అంతే సొమ్ము జనధన్  ఖాతాలలో జమ చేస్తున్నారు. ఆయన కష్టాన్ని అర్ధం చేసుకోకుండా అన్నా చెల్లెళ్లు ఆయన్ని డబ్బున్న వారి కాపలాదారు అనడం ఎంత వరకు సమంజసం?  దేశం లోపల  కంటే వెలుపలే ఎక్కువ ఉంటున్నాడు అని  ఆరోపణ .  నిజం సెప్పండి , మన ఇంటి కాపలాదారు  మన ఇంట్లో కంటే పక్కింటి కాపలాదారుతో ఎక్కువ సమయం గడిపడూ ?ఇది కూడా అంతే !!! అంతేగా అంతేగా !!1

Thursday, October 12, 2017

విద్యుతుత్పత్తి కేంద్రం - స్థల నిర్ధారణ

గౌరవనీయ  ముఖ్యమంత్రి గారు  ఈ రోజు సూర్యాపేట లో మాట్లాడుతూ చెప్పిన సూత్రం :
ఎక్కడైతే ఎక్కువ మోటార్లు వాడుకలో ఉంటాయో అక్కడే విద్యుతుత్పత్తి కేంద్రం ఉండాలి . అక్కడ బొగ్గు , నీరు , రైలు మార్గం తదితర వనరులు ఉన్నా లేకపోయినా .
60 ఏళ్లుగా పాలించిన సన్నాసులకి ఆ తెలివి తేటలు లేక, ఉత్తర తెలంగాణా లో, గోదావరి లోయలో, ఎక్కడైతే బొగ్గు, నీరు పుష్కలం గా ఉందో , ఎక్కడ రైలు మార్గం సులభమో  - NTPC, KTPS, KTPP తదితర విద్యుతుత్పత్తి కేంద్రాలు కట్టారు.
జై తెలంగాణ జై జై తెలంగాణ 

Thursday, September 25, 2014

నానమ్మ

" ఈ పాలి నువ్వొచ్చే సరికి నేనుంటనో ఉండనో బిడ్డా - చాన సంబరం గుంది నిన్ను,నీ బిడ్డని చూశాలకి " - వెళ్లిన ప్రతిసారి మేము వినే మాటలు . ఆ మాటలు ఇక వినలేము అని అనుకొన్న ప్రతిసారి ఒకరకమైన బాధ. నానమ్మ పడినబాధలతో పోలిస్తే అదోకపెద్దబాధ కాదని సరిపెట్టుకోవాలి.
నేను తనతో గడిపిన సమయం, తను బతికిన 100 సంవత్సరాలతో పోలిస్తే చాలా తక్కువ. నాకున్న 38 సంవత్సరాలలో తనకి ఇది కావాలని ఎవరినీ అడిగిన గుర్తు లేదు. అంతకు ముందు తాతని ఏమన్నా అడిగి ఉంటుందా అని ఎంత అలోచించినా ఏమీ తట్టడం లేదు. నాకే కాదు - అంత పెద్ద కుటుంబం లో ఎవరికీ తట్టక పోవచ్చు.
కళ్ళజోడు  మాటిమాటికీ తీసి తుడుచుకోడం చూసి - కనపడటం లేదా అని అడిగితే తప్ప - విషయం చెప్పని మొహమాటమో, ఎదుటి వాళ్లని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేని తనమో, లేక అడిగి లేదనిపించుకోవడం దేనికనే అభిమానమో అర్ధం కాదు.  ఇంతోటి 500 రూపాయల కళ్ళజోడు సరిచేయించానని 500 మందికంటే ఎక్కువ మందికే చెప్పి ఉంటుంది .  నా చిన్నప్పుడు ఊరు వెళ్ళిన ప్రతిసారి తను ఇచ్చిన 20 రూపాయలకంటే అది ఏ మాత్రం ఎక్కువ ? ఊరి నుండి మేము వచ్చాం అనగానే తను పడే హడావిడి అంతా ఇంతా కాకుండేది. ఎవడో ఒకడిని పిలిచి కొట్టుకి పంపి కోడి గుడ్డు తెప్పించి,  కూర వండి మాకు పెట్టి , తను మాత్రం జొన్నన్నం,  పచ్చడి తినేది  మా పిచ్చి నానమ్మ.
రెండే రెండు గదుల పూరింట్లో, ఉండీ ఉండని డబ్బులతో, 9 మంది పిల్లలని ఎలా పెంచిందో - ఇప్పటి వాళ్లకి ఊహకి అందని విషయం. పెంచడం మామూలుగా కాదు - అందరూ గౌరవప్రదమైన ఉద్యోగాలు, జీవితాలు అనుభవించే స్థాయికి వచ్చేలా పెంచడం.రెండు జతల బట్టలు - మనుషులంటే ప్రేమ , ఎవరినీ నొప్పించక పోవడం అనే రెండు గుణాలతో వందేళ్ళు బతికేసింది మా నానమ్మ .


రెండేళ్ళ క్రితం దీపావళి కి నా ఇంటికి వచ్చి దగ్గరుండి పండుగ చేయించింది. ఇల్లు అంతా తిరిగి చూసి ఎంత సంబర పడిందో - మనవడు పేద్ద మేడ కట్టుకు న్నాడని చాన  సంబరంగుంది నాయన అని చెంపలు నిమిరి చెప్పిన జ్ఞాపకం నాకే కాదు స్ప్పూర్తి కి కూడా గుర్తే ఉంది.
ఆ జ్ఞాపకాలు చాలు, మిగిలి పోతాయి నానమ్మా - నా మనవళ్ళ వరకూ .

Monday, June 16, 2014

మరోసారి !!!

దాదాపు ఏడేళ్ల తరువాత మళ్లీ రాద్దామని ప్రయత్నం !

Tuesday, October 02, 2007

ఎవడబ్బా సొమ్మని ?

అయిదేళ్లకో కొత్త ఎపిసోడ్ తో నడిచే కామెడీ సీరియల్ ప్రస్తుత ఎపిసోడ్ చివరి అంకం లో ఉన్నట్టుంది . ఒక్క ఎర్ర చొక్కాలు తప్ప అందరూ ఎగబడి వరాలు ఇచ్చేస్తున్నారు . అవి నిజం గా వరాలా? శాపాలా? పేదవాడికి అన్నీ ఉచితం గా ఇస్తాం అంటున్నారు . ఎలా ఇస్తారు? మధ్యతరగతి వాడి దగ్గర లాక్కొని పేద వాడికి పంచా? తినడానికి కిలో 2 కి బియ్యం ఇచ్చి, ఉండటానికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి , కాళ్లు బార్లా చాపుకొని చూడటానికి కలర్ టీవి ఇచ్చి పేదవాడి జీవన ప్రమాణాలు పెంచుతున్నారా? లేక అన్నిటికి మీమీద ఆధారపడేటట్టు చేసి ,తన బతుకు తను బతికే హక్కుని లాక్కొంటున్నారా? ప్రతి ఒక్కడూ అదిస్తాం ఇదిస్తాం అనేవాడే తప్ప ఎలా ఇస్తారో, ఒక్క జె.పి తప్ప , చెప్పిన పాపాన పోలేదు . చెప్పేదేముంది సబ్సిడీ ఇస్తాం అంటారు . అంతేనా? సబ్సిడీ వలన కలిగే లోటు ని ఎలా పూడుస్తారు? ప్రభుత్వ ఆస్తులు అమ్మనయినా అమ్మాలి . లేదా అప్పులు తేవాలి. ఆస్తులు ఏదో ఒకరోజుకి తరగక తప్పవు . అప్పులు తీర్చకా తప్పదు . అప్పు ఎలా తీరుస్తారు? మళ్లీ కథ మొదటికే . పన్నులు వేయడం . పన్ను కట్టేది ఎవడు ? కొనుక్కొన్న వాడు, సంపాయించిన వాడు ...ఉరఫ్ మధ్యతరగతి వాడు . పేదవాడికి పని చూపించ గలిగితే కదా వాడి సంపాదన మీద పన్ను వేయగలిగేది . లేదా వాడు కొనుక్కొగలిగితే కదా వాడి కొనుగోళ్ల మీద పన్ను వేయ గలిగేది . రెడ్డి గారు పెద్ద ఎత్తున జలయజ్ఞం మొదలెడితే ఇన్నాళ్లకి ఒక మంచిపని చేసారు అనుకొన్నా . ప్రాజెక్టులు ప్రత్యక్షం గా పరోక్షంగా చాలా మందికి పని చూపిస్తాయన్న నమ్మకం తో . కాని ప్రాజెక్టుల వ్యయం లో సగానికి పైన లెక్కలకి మాత్రమే పరిమితం అయినట్లున్నాయి. మిగతా మొత్తం ఎవరో కొందరు పెద్ద మనుషుల జేబుల్లోకి చేరాయి .
ప్రియతమ మాజీ , నేను అర్ధ శాస్త్రం లో పట్టభద్రుడిని , నాకు తెలుసు ఎలా బడ్జెట్ వేయాలో అన్నారు . గత ఎన్నికల ముందు వరకు మీరు మీ ఆర్ధికశాస్త్ర ప్రతిభ ఉపయోగించినట్టున్నారు . ప్రస్తుతం పక్కా రాజకీయ ప్రతిభని చూపిస్తున్నారు .
ఒకరు 7 అంటే , ఒకరు 9 , మరొకరు 12... ఇది కూరగాయల మార్కెట్టు లా ఉంది తప్పితే పెజస్వామ్యం లా లేదు . ఎంతసేపు అధికారం లోకి ఎలా రావాలో అన్న ధ్యాస తప్ప ప్రజల బాగోగులు పట్టించుకొనే వాడెవడు ? మేమున్నాం అంటూ ఎర్ర జండా అక్కడక్కడ పైకి లేస్తుంది కానీ ఆ జండా కూడా ఆ తానులో ముక్కే . "ప్రతి సమస్య కి అమెరికా యే కారణం " అది వారి నినాదం . పొరుగున ఉన్న కమ్యూనిస్టు చైనా అమెరికా తో చేసే వ్యాపారం ఎంతో వాళ్లకీ తెలుసు . చైనా ఎంతగనం విదేశీ పెట్టుబడులని ప్రోత్సహిస్తుందో కూడా తెలుసు . ఓ జ్యోతిబసు, ఓ బుద్ధదేవ్ లాంటి వౄద్ద నేతలు మాత్రమే ఆ నిజాన్ని ఎందుకు ఒప్పుకోగలిగారు ? బంద్ చేయొద్దు అన్నందుకు న్యాయ వ్యవస్థ మీద నిప్పులు చెరగడం మాత్రమే యువతరపు ఎర్ర చొక్కాలకి తెలుసు అనుకోవాలా?
ఆలొచిద్దాం .. ఆలొచింప చేద్దాం .. ఈ సారి వోటేసేముందో సారి ...