ఎవడబ్బా సొమ్మని ?
అయిదేళ్లకో కొత్త ఎపిసోడ్ తో నడిచే కామెడీ సీరియల్ ప్రస్తుత ఎపిసోడ్ చివరి అంకం లో ఉన్నట్టుంది . ఒక్క ఎర్ర చొక్కాలు తప్ప అందరూ ఎగబడి వరాలు ఇచ్చేస్తున్నారు . అవి నిజం గా వరాలా? శాపాలా? పేదవాడికి అన్నీ ఉచితం గా ఇస్తాం అంటున్నారు . ఎలా ఇస్తారు? మధ్యతరగతి వాడి దగ్గర లాక్కొని పేద వాడికి పంచా? తినడానికి కిలో 2 కి బియ్యం ఇచ్చి, ఉండటానికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి , కాళ్లు బార్లా చాపుకొని చూడటానికి కలర్ టీవి ఇచ్చి పేదవాడి జీవన ప్రమాణాలు పెంచుతున్నారా? లేక అన్నిటికి మీమీద ఆధారపడేటట్టు చేసి ,తన బతుకు తను బతికే హక్కుని లాక్కొంటున్నారా? ప్రతి ఒక్కడూ అదిస్తాం ఇదిస్తాం అనేవాడే తప్ప ఎలా ఇస్తారో, ఒక్క జె.పి తప్ప , చెప్పిన పాపాన పోలేదు . చెప్పేదేముంది సబ్సిడీ ఇస్తాం అంటారు . అంతేనా? సబ్సిడీ వలన కలిగే లోటు ని ఎలా పూడుస్తారు? ప్రభుత్వ ఆస్తులు అమ్మనయినా అమ్మాలి . లేదా అప్పులు తేవాలి. ఆస్తులు ఏదో ఒకరోజుకి తరగక తప్పవు . అప్పులు తీర్చకా తప్పదు . అప్పు ఎలా తీరుస్తారు? మళ్లీ కథ మొదటికే . పన్నులు వేయడం . పన్ను కట్టేది ఎవడు ? కొనుక్కొన్న వాడు, సంపాయించిన వాడు ...ఉరఫ్ మధ్యతరగతి వాడు . పేదవాడికి పని చూపించ గలిగితే కదా వాడి సంపాదన మీద పన్ను వేయగలిగేది . లేదా వాడు కొనుక్కొగలిగితే కదా వాడి కొనుగోళ్ల మీద పన్ను వేయ గలిగేది . రెడ్డి గారు పెద్ద ఎత్తున జలయజ్ఞం మొదలెడితే ఇన్నాళ్లకి ఒక మంచిపని చేసారు అనుకొన్నా . ప్రాజెక్టులు ప్రత్యక్షం గా పరోక్షంగా చాలా మందికి పని చూపిస్తాయన్న నమ్మకం తో . కాని ప్రాజెక్టుల వ్యయం లో సగానికి పైన లెక్కలకి మాత్రమే పరిమితం అయినట్లున్నాయి. మిగతా మొత్తం ఎవరో కొందరు పెద్ద మనుషుల జేబుల్లోకి చేరాయి .
ప్రియతమ మాజీ , నేను అర్ధ శాస్త్రం లో పట్టభద్రుడిని , నాకు తెలుసు ఎలా బడ్జెట్ వేయాలో అన్నారు . గత ఎన్నికల ముందు వరకు మీరు మీ ఆర్ధికశాస్త్ర ప్రతిభ ఉపయోగించినట్టున్నారు . ప్రస్తుతం పక్కా రాజకీయ ప్రతిభని చూపిస్తున్నారు .
ఒకరు 7 అంటే , ఒకరు 9 , మరొకరు 12... ఇది కూరగాయల మార్కెట్టు లా ఉంది తప్పితే పెజస్వామ్యం లా లేదు . ఎంతసేపు అధికారం లోకి ఎలా రావాలో అన్న ధ్యాస తప్ప ప్రజల బాగోగులు పట్టించుకొనే వాడెవడు ? మేమున్నాం అంటూ ఎర్ర జండా అక్కడక్కడ పైకి లేస్తుంది కానీ ఆ జండా కూడా ఆ తానులో ముక్కే . "ప్రతి సమస్య కి అమెరికా యే కారణం " అది వారి నినాదం . పొరుగున ఉన్న కమ్యూనిస్టు చైనా అమెరికా తో చేసే వ్యాపారం ఎంతో వాళ్లకీ తెలుసు . చైనా ఎంతగనం విదేశీ పెట్టుబడులని ప్రోత్సహిస్తుందో కూడా తెలుసు . ఓ జ్యోతిబసు, ఓ బుద్ధదేవ్ లాంటి వౄద్ద నేతలు మాత్రమే ఆ నిజాన్ని ఎందుకు ఒప్పుకోగలిగారు ? బంద్ చేయొద్దు అన్నందుకు న్యాయ వ్యవస్థ మీద నిప్పులు చెరగడం మాత్రమే యువతరపు ఎర్ర చొక్కాలకి తెలుసు అనుకోవాలా?
ఆలొచిద్దాం .. ఆలొచింప చేద్దాం .. ఈ సారి వోటేసేముందో సారి ...