Thursday, September 25, 2014

నానమ్మ

" ఈ పాలి నువ్వొచ్చే సరికి నేనుంటనో ఉండనో బిడ్డా - చాన సంబరం గుంది నిన్ను,నీ బిడ్డని చూశాలకి " - వెళ్లిన ప్రతిసారి మేము వినే మాటలు . ఆ మాటలు ఇక వినలేము అని అనుకొన్న ప్రతిసారి ఒకరకమైన బాధ. నానమ్మ పడినబాధలతో పోలిస్తే అదోకపెద్దబాధ కాదని సరిపెట్టుకోవాలి.
నేను తనతో గడిపిన సమయం, తను బతికిన 100 సంవత్సరాలతో పోలిస్తే చాలా తక్కువ. నాకున్న 38 సంవత్సరాలలో తనకి ఇది కావాలని ఎవరినీ అడిగిన గుర్తు లేదు. అంతకు ముందు తాతని ఏమన్నా అడిగి ఉంటుందా అని ఎంత అలోచించినా ఏమీ తట్టడం లేదు. నాకే కాదు - అంత పెద్ద కుటుంబం లో ఎవరికీ తట్టక పోవచ్చు.
కళ్ళజోడు  మాటిమాటికీ తీసి తుడుచుకోడం చూసి - కనపడటం లేదా అని అడిగితే తప్ప - విషయం చెప్పని మొహమాటమో, ఎదుటి వాళ్లని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేని తనమో, లేక అడిగి లేదనిపించుకోవడం దేనికనే అభిమానమో అర్ధం కాదు.  ఇంతోటి 500 రూపాయల కళ్ళజోడు సరిచేయించానని 500 మందికంటే ఎక్కువ మందికే చెప్పి ఉంటుంది .  నా చిన్నప్పుడు ఊరు వెళ్ళిన ప్రతిసారి తను ఇచ్చిన 20 రూపాయలకంటే అది ఏ మాత్రం ఎక్కువ ? ఊరి నుండి మేము వచ్చాం అనగానే తను పడే హడావిడి అంతా ఇంతా కాకుండేది. ఎవడో ఒకడిని పిలిచి కొట్టుకి పంపి కోడి గుడ్డు తెప్పించి,  కూర వండి మాకు పెట్టి , తను మాత్రం జొన్నన్నం,  పచ్చడి తినేది  మా పిచ్చి నానమ్మ.
రెండే రెండు గదుల పూరింట్లో, ఉండీ ఉండని డబ్బులతో, 9 మంది పిల్లలని ఎలా పెంచిందో - ఇప్పటి వాళ్లకి ఊహకి అందని విషయం. పెంచడం మామూలుగా కాదు - అందరూ గౌరవప్రదమైన ఉద్యోగాలు, జీవితాలు అనుభవించే స్థాయికి వచ్చేలా పెంచడం.రెండు జతల బట్టలు - మనుషులంటే ప్రేమ , ఎవరినీ నొప్పించక పోవడం అనే రెండు గుణాలతో వందేళ్ళు బతికేసింది మా నానమ్మ .


రెండేళ్ళ క్రితం దీపావళి కి నా ఇంటికి వచ్చి దగ్గరుండి పండుగ చేయించింది. ఇల్లు అంతా తిరిగి చూసి ఎంత సంబర పడిందో - మనవడు పేద్ద మేడ కట్టుకు న్నాడని చాన  సంబరంగుంది నాయన అని చెంపలు నిమిరి చెప్పిన జ్ఞాపకం నాకే కాదు స్ప్పూర్తి కి కూడా గుర్తే ఉంది.
ఆ జ్ఞాపకాలు చాలు, మిగిలి పోతాయి నానమ్మా - నా మనవళ్ళ వరకూ .

Monday, June 16, 2014

మరోసారి !!!

దాదాపు ఏడేళ్ల తరువాత మళ్లీ రాద్దామని ప్రయత్నం !

Tuesday, October 02, 2007

ఎవడబ్బా సొమ్మని ?

అయిదేళ్లకో కొత్త ఎపిసోడ్ తో నడిచే కామెడీ సీరియల్ ప్రస్తుత ఎపిసోడ్ చివరి అంకం లో ఉన్నట్టుంది . ఒక్క ఎర్ర చొక్కాలు తప్ప అందరూ ఎగబడి వరాలు ఇచ్చేస్తున్నారు . అవి నిజం గా వరాలా? శాపాలా? పేదవాడికి అన్నీ ఉచితం గా ఇస్తాం అంటున్నారు . ఎలా ఇస్తారు? మధ్యతరగతి వాడి దగ్గర లాక్కొని పేద వాడికి పంచా? తినడానికి కిలో 2 కి బియ్యం ఇచ్చి, ఉండటానికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి , కాళ్లు బార్లా చాపుకొని చూడటానికి కలర్ టీవి ఇచ్చి పేదవాడి జీవన ప్రమాణాలు పెంచుతున్నారా? లేక అన్నిటికి మీమీద ఆధారపడేటట్టు చేసి ,తన బతుకు తను బతికే హక్కుని లాక్కొంటున్నారా? ప్రతి ఒక్కడూ అదిస్తాం ఇదిస్తాం అనేవాడే తప్ప ఎలా ఇస్తారో, ఒక్క జె.పి తప్ప , చెప్పిన పాపాన పోలేదు . చెప్పేదేముంది సబ్సిడీ ఇస్తాం అంటారు . అంతేనా? సబ్సిడీ వలన కలిగే లోటు ని ఎలా పూడుస్తారు? ప్రభుత్వ ఆస్తులు అమ్మనయినా అమ్మాలి . లేదా అప్పులు తేవాలి. ఆస్తులు ఏదో ఒకరోజుకి తరగక తప్పవు . అప్పులు తీర్చకా తప్పదు . అప్పు ఎలా తీరుస్తారు? మళ్లీ కథ మొదటికే . పన్నులు వేయడం . పన్ను కట్టేది ఎవడు ? కొనుక్కొన్న వాడు, సంపాయించిన వాడు ...ఉరఫ్ మధ్యతరగతి వాడు . పేదవాడికి పని చూపించ గలిగితే కదా వాడి సంపాదన మీద పన్ను వేయగలిగేది . లేదా వాడు కొనుక్కొగలిగితే కదా వాడి కొనుగోళ్ల మీద పన్ను వేయ గలిగేది . రెడ్డి గారు పెద్ద ఎత్తున జలయజ్ఞం మొదలెడితే ఇన్నాళ్లకి ఒక మంచిపని చేసారు అనుకొన్నా . ప్రాజెక్టులు ప్రత్యక్షం గా పరోక్షంగా చాలా మందికి పని చూపిస్తాయన్న నమ్మకం తో . కాని ప్రాజెక్టుల వ్యయం లో సగానికి పైన లెక్కలకి మాత్రమే పరిమితం అయినట్లున్నాయి. మిగతా మొత్తం ఎవరో కొందరు పెద్ద మనుషుల జేబుల్లోకి చేరాయి .
ప్రియతమ మాజీ , నేను అర్ధ శాస్త్రం లో పట్టభద్రుడిని , నాకు తెలుసు ఎలా బడ్జెట్ వేయాలో అన్నారు . గత ఎన్నికల ముందు వరకు మీరు మీ ఆర్ధికశాస్త్ర ప్రతిభ ఉపయోగించినట్టున్నారు . ప్రస్తుతం పక్కా రాజకీయ ప్రతిభని చూపిస్తున్నారు .
ఒకరు 7 అంటే , ఒకరు 9 , మరొకరు 12... ఇది కూరగాయల మార్కెట్టు లా ఉంది తప్పితే పెజస్వామ్యం లా లేదు . ఎంతసేపు అధికారం లోకి ఎలా రావాలో అన్న ధ్యాస తప్ప ప్రజల బాగోగులు పట్టించుకొనే వాడెవడు ? మేమున్నాం అంటూ ఎర్ర జండా అక్కడక్కడ పైకి లేస్తుంది కానీ ఆ జండా కూడా ఆ తానులో ముక్కే . "ప్రతి సమస్య కి అమెరికా యే కారణం " అది వారి నినాదం . పొరుగున ఉన్న కమ్యూనిస్టు చైనా అమెరికా తో చేసే వ్యాపారం ఎంతో వాళ్లకీ తెలుసు . చైనా ఎంతగనం విదేశీ పెట్టుబడులని ప్రోత్సహిస్తుందో కూడా తెలుసు . ఓ జ్యోతిబసు, ఓ బుద్ధదేవ్ లాంటి వౄద్ద నేతలు మాత్రమే ఆ నిజాన్ని ఎందుకు ఒప్పుకోగలిగారు ? బంద్ చేయొద్దు అన్నందుకు న్యాయ వ్యవస్థ మీద నిప్పులు చెరగడం మాత్రమే యువతరపు ఎర్ర చొక్కాలకి తెలుసు అనుకోవాలా?
ఆలొచిద్దాం .. ఆలొచింప చేద్దాం .. ఈ సారి వోటేసేముందో సారి ...

Wednesday, September 19, 2007

అయ్యో రామా !!!

ఒకాయన , పెజా ప్రతినిధే లెండి , దేవుడి మీద కేసు వేసాడు .. ప్రస్తుత చర్చ ఆ కేసు విచారణ కి ప్రతి వాది గా ఎవరు వస్తారు కోర్టుకి అని .. అది అమెరికా లో వేసాడు కాబట్టి అంత గందరగోళం .. వాళ్లకి ఒక్కడే దేవుడు ..అదే మనకైతే మన ముక్కోటి దేవుళ్లలో ఎవరు వచ్చేవారు కోర్టుకి ? సోనియా మేడం సెలవిస్తారేమో ఫలానా దేవుణ్ణి విచారించండి అని .. లేక అగ్ని ప్రమాదాలకి అగ్ని దేవుణ్ణి , వరదలకి వరుణ దేవుణ్ణి అలా కేసుని బట్టి ఏ దేవుణ్ణి కేసులో చేర్చాలో నిర్ణయిస్తారేమో .. ఈ విషయం లో మాత్రం మనవాళ్ల ముందు చూపు భేష్ .. ఇలాంటి రోజు ఎప్పుడో ఒకరోజు వస్తుందని ముందే ఊహించి దేవలోకం లో మంచి organization chart తయారు చేసి పెట్టేసారు .. కాకపోతే ఒక చిక్కుంది ...ఆ ముక్కోటి దేవుళ్లలో లేని మన నాయక దేవుళ్లు అడ్డం తిరిగి "ఫలానా దేవుడున్నాడని ఏంటి రుజువు ? ఆయన ఆ విభాగానికి అధిపతి చేయడానికి ఆయన అర్హతలేంటి" లాంటి విలువైన ప్రశ్నలేసి పనీ పాట లేని మనలాంటి వాళ్ల విలువైన సమయం వౄధా చేయడానికి కావలసినంత వినోదం పంచే అవకాశం ఉంది ..మనకి రాముడున్నాడో లేడొ ముఖ్యం గాని అణు విద్యుత్ దేనికి ? మనసులో జ్యోతే వెలగనప్పుడు (సగటు జీవి) గదిలో లైటు వెలిగితే ఎంత వెలగకపోతే ఎంత ... అంతా మిధ్య ...
********
లాలూని జైల్లో పెట్టినప్పుడు బాధ పడ్డా... అంతలా హాస్యం పంచే నాయకుడిని కోల్పోతామే అని .. బీహార్ నుండి ఢిల్లీ కి వెళ్లాక చమక్కులు తగ్గాయే అని బాధ పడుతున్నా .. ఆ బాధ తీర్చడానికి ప్రియతమ ముఖ్యమంత్రిని ఉన్నాడో లేదో తెలియని రాముడే పంపించినట్టున్నాడు ..

Saturday, September 08, 2007

రెండు పుస్తకాలు

ప్రస్తుతం బాగా అమ్ముడయ్యే అవకాశం ఉన్న పుస్తకాలు ?
1) ఇందిరా సహస్ర నామావళి
2) రాజీవ సూక్తం

Thursday, August 30, 2007

వార్తలు ...

నిన్నటి జెమిని వార్తా విశేషాలు :
1) నిందితుని ఊహా చిత్రం విడుదల
2) నిమ్మకూరు లో రిసెప్షన్
3) నాగార్జున పుట్టినరోజు వేడుకలు

ఇంతకు మించి పెద్దగా చెప్పుకోదగ్గ వార్తలేమీ లేవా?

Tuesday, August 28, 2007

...

Monday, August 27, 2007

మార్పు

జయ ప్రకాష్ నారాయణ( లోక్ సత్తా), శ్రీరాం ...వీరు స్పందించిన తీరు సమాజం లో మార్పు మీద నమ్మకం కలిగిస్తుంది ...

Monday, August 06, 2007

సాంకేతికం

ఎప్పటి నుండో ఒక ఆలోచన .. పద్మ లో ఉన్న javascript ని blogger template లో వాడి , post body తెలుగు కి మార్పు సాధ్యమా? కాదా? నాకైతే సాధ్యమే అనిపిస్తుంది .. template customization చేసుకోడం అందరికి తెలిసిన విషయమే కదా ..
మరో విషయం ..దీనికి పైన ప్రస్తావించిన దానికీ సంబంధం లేదు .. ఇంటర్వూలు చేసేప్పుడు ఒకోసారి నవ్వు, ఒకోసారి కోపం వస్తూ ఉంటాయి .. అయ్యలూ అమ్మలూ మీరు resume లో రాసిన దాని గురించి సరిగా తెలుసుకొని ఇంటర్వ్యూకి రండి అని అరిచి చెప్పాలని అనిపిస్తుంది .. కాస్తొ కూస్తో మనగురించి మనం పొగుడుకోడం తప్పులేదు ...కాని 5 సంవత్సరాలు experience అని పెట్టి , class కి object కి తేడా తెలియదు అంటే వినడానికి బావోదు కదా ..

Sunday, July 29, 2007

"పోరాడితే పోయేది?" - ప్రాణాలు

ప్రతీ వాడూ బషీర్ బాగ్ , నందిగ్రాం గురించి అడిగేవాడే .. అంతేతప్ప ప్రస్తుతం ప్రాణం పోయిన వారి గురించి ఆలోచించేదెవడు ? ఉద్యమం లో ప్రాణం ఎప్పుడూ పేద వాడిదే ఎందుకు పోతుంది? ముందుండి నడిపించేవాడు నాయకుడు అయి ఉంటే ముందు నాయకుడు కదా పోవాల్సింది ? మరో సారి ౠజువు చేసారు .. ఉద్యమం తప్ప లక్ష్యం ముఖ్యం కాదు అని .. ఇంతకీ సాధించింది ఏంటి? బషీర్ బాగ్ కాల్పులకి కరెంటు చార్జీలు తగ్గాయా? నందిగ్రాం కాల్పులకి టాటాల కర్మాగారం రాకుండా పోయిందా? పోయేదీ , పోతున్నదీ పేదవాడి ప్రాణం ... "పోరాడితే పోయేది సంకెళ్లు" కాదు ...ప్రాణాలు .. అవికూడా .. అమాయక ప్రజలవి ..

Thursday, July 12, 2007

అ.అ.ఆ - భా.ప్ర.బి

నిన్న రాయలనుకొన్న మిగతా భాగం ....
2020 ఒకానొక రోజు ..ఏ రోజనేది అనవసరం ..పనేమీ లేక ఖాళీగా ఉన్న అ.అ.ఆ( అమెరికా అధ్యక్ష పీఠం మీదున్న ఆంధ్రుడు) భా.ప్ర.బి( భారత ప్రధాని బిల్) తో పిచ్చాపాటిగా వీడియో కాన్ఫరెన్సు లో ...
అ.అ.ఆ : హలో బిల్ .. ఎలా ఉంది భారతం ?
భా.ప్ర.బి : ఏదో ఉంది .. చేతులు కట్టి పడేసినట్టుంది .. చేయడానికి యుద్దాలే లేవు .. ఈ భారతీయులు ఇంత శాంతి కామకులేంటో .. అప్పట్లో ఇరాకు, ఇరాను ,క్యూబా లుండేవి ..ఇప్పుడవి లేవు ..కనీసం పాకిస్తానుతో నయినా చేద్దాం అంటే ..మాటలే తప్పితే చేతలు దాకా వచ్చేలా లేదు ..
అ.అ.ఆ: భారత్ లో అంతే ... మా వాళ్లు వాళ్లళ్లో వాళ్లు కొట్లాడుకొంటారు ..ఖమ్మం జిల్లా వాళ్లు ప్రత్యేక రాష్ట్రం ...తెలంగాణా తెలుగుకి ప్రాచీన హోదా ....వగైరాలు ఉంటాయి కద ..ఆవిధంగా ముందుకెళ్లాలి మరి ..
భా.ప్ర.బి: అది ఉందనుకో ..ఈ కమ్యునిస్టుల సంగతేంటి .. నెలకో కొత్త ఉద్యమం అంటారు ?
అ.అ.ఆ: అది మామూలే ... వాళ్లకి ఉద్యమం ముఖ్యం .. లక్ష్యం కన్నా ... మనకి లాభించేది అయితే మన పాలన లేని చోట వాళ్లతో కలిసి పోరాడటమే.. మనం పాలనో ఉన్న చోట వాళ్ల ఒత్తిడికి కొంచెం తలొగ్గినట్టు నటిస్తూ ముందుకు పోవాలి ...
బా.ప్ర.బి : అంతే నంటావా ...సరే నీ సంగతేంటి ?
అ.అ.ఆ : ఇక్కడ కూడా అదే పరిస్థితి .. జన్మ భూమి, ప్రజల వద్దకు పాలన, వెలుగు ,దీపం వగైరాలు చేపట్టి ముందుకు పోదాం అంటే ఆ అవకాశమే లేకుండా చేసారుగా .. వినూత్నం గా చంద్రమండలానికి రోడ్డు వేసి ముందుకు పోదామనుకోటున్నాం ..విజన్ 2050 లో అదొక కార్యక్రమం ..అలాగే ఇక్కడి రైతన్నలు I.T ఫలాలు పండిచడమనే మరొక కార్యక్రమం చేపడుతున్నా ....

Wednesday, July 11, 2007

అమెరికా అధ్యక్ష పీఠం మీద తెలుగు వాడు

2020 .. అమెరికా అధ్యక్ష పీఠం మీద తెలుగు వాడు ..2007 తానా సభల్లో చెప్పుకొన్నట్టు ..ఆ తెలుగువాడు మరొవరో కాదు .. C.B నాయ్డు .. అవును రోజుకి పద్దెనిమిది గంటలు కష్టపడి పనిచేసే CBN .. vision 2020 కోసం రోజుకి పద్దెనిమిది గంటలు పనిచేసిన CBN ...చేయడానికి పనేమీ లేక చిరాగ్గా ఉంది ...కరెంటు కష్టాలు లేవు..పోనీ జన్మ భూమి లాంటి ప్రజాదరణ పొందే పధకం మొదలెడదామా అంటే చెరువుల్లో పూడికే లేదు ...నీళ్లు పుష్కలంగా ఉన్నాయి .. రోడ్లేఇద్దామా అంటే ఆ అవసరమే లేదులా ఉంది .. పనికి ఆహార పధకం అవసరమే లేదు .. పోని సరదాగా రెడ్డి గారిని కవ్విద్దాం అంటే ఆయన ఇంకా ఆంధ్రా లోనే ఉండి ప్రోజెక్టుల మీద ప్రోజెక్టులు మొదలెడుతూ ( పూర్తి చేస్తారేమో అని జనం ఎదురు చూస్తూనే ఉన్నారనుకోండి ) బిజీ గా ఉన్నాడు .. ఏదో ఒకటి చేయాలి ..లేకపోతే రోజుకి పద్దెనిమిది గంటల వ్రతం చెడిపోయేలా ఉంది .. కానీ ఏం చేయాలో అర్ధం కావడం లేదు ...
ఏం చేస్తాడో ?

Wednesday, June 06, 2007

టూకీగా కొన్ని ???

శ్రీమతి & శ్రీ దగ్గుపాటి రామారావు గారి కుటుంబమా? కాదా?
తెరాస , కాంగ్రెస్సు రాసుకొంటే తెలంగాణా రాలిందా?
కాంగ్రెస్సు , ఎర్రజండాలు రాసుకొంటే పోలవరం ఆగిందా?

Tuesday, May 29, 2007

టూకీగా

మంత్రిపదవి ఎందుకు?
ఇంట్లో పెళ్ళాం , పిల్లల మోజు తీర్చడానికి ..
ఉప్పనూతల గారి ఉవాచ

Friday, May 18, 2007

పునరంకితం

పునరంకితం ఎవరు దేనికి అవుతున్నారో అర్ధం కాకుండా ఉంది ... రెండేళ్లలో రెండున్నర లక్షల ఉద్యోగాలు సౄష్టిస్తామని అన్నారని గుర్తు ... రెండున్నర లక్షల ఉద్యోగాలేమో గాని రెండువందల యాభై వరకు పదవులు మాత్రం తయారు చేసి పంచి పెట్టారు ...మండలితో కలుపుకొని ... మరి ముఖ్యమంత్రి, కొందరు ప్రముఖులే పునరంకితం అయితే పెజా సేవ లో వెనకబడి పోతారు కదా .. పునరంకితం అయ్యే అవకాశం అందరికీ కల్పించడం నిజంగా ముదావహం ...పనిలో పనిగా పాతబస్తీలో అల్లర్లు చేసే మూక కూడా వారి పనికి పునరంకితం అవుతున్నట్లున్నారు .. పాతబస్తీ అల్లర్లు కాంగ్రెస్సు అధికారం లో ఉన్నప్పుడే ఎందుకు జరుగుతాయో ...

Monday, April 16, 2007

టూకీగా

భార్యా భర్తల మధ్య మాటలు లేనప్పుడు - ఇంట్లో గిన్నెలు , తపాలాలు మాట్లాడతాయి :)

Friday, April 13, 2007

చదువు

ఏంటబ్బా ఇంకా మనవాళ్లు వెనకబడి ఉన్నారు అనుకొంటున్నా -- తెచ్చేసారు కొత్త చట్టం - పిల్లలని కొడితే జైలు --- భేష్
" అసలు సంస్కారం ఉండాలి .చదువుకొనే ఆసక్తి ఉండాలి .చదువుని ఎంజాయ్ చేయాలి .రాత , అట్టానే చదువు అట్టానే ఉండాలి .రాయడం ఒక అనుభవం , మనం ఏదైనా సరే మనుసుని వికసింపచేసేది , అసలు మనసుని ఆహ్లాద పెట్టేది ఏది చెప్పినా అది గొప్ప లిటరేచర్ అయిపోవాలి ఆ చదివేవాళ్లకి గూడా అబ్బా! ఈ పుస్తకం ఇవాళ చదవాల్సి వచ్చిందే, ఏం కర్మం పట్టిందని తెల్లారగట్టే లేచి కూచొని చదివేట్టుగా ఉండకూడదు. తక్కిన సంతోషాలు లోకంలో ఉండవూ. ఆవిధంగానే తను ఎంజాయ్ చేసేటటువంటి ఒక విషయంగా ఉండాలి చదువు అంటే.బడి ఉంటుంది , దాంటో పాఠాలు అక్కర్లేదు . మనం కావలసిన కధల పుస్తకాలో, నవలలో, ప్రయాణపు కధల పుస్తకాలో , ఇవన్నీ కూడా చదువుకునేందుకు ఉపయోగపడాలి . గొప్ప కవిత్వం తెలుసుకోవాలి . ఎంతసేపటికి ఈ క్లాస్ పాస్ అయి పైక్లాస్ ని ఎట్టా పోవాలి? అందులో కూడా తను క్లాస్ సంపాయించాలి. తక్కిన వాళ్లతో పోటీబడి తను ప్రధముడై రావాలి . తను ఏ విధంగా వచ్చినా సరే, దాని కోసం ఎన్ని సంవత్సరాలు ప్రజల జీవితాలు కాలిపోతున్నాయో చూడండి. పుట్టినప్పటినుంచి రెండో ఏడో, మూడో, పదో ఎప్పుడు వస్తుందా? వీణ్ణి ఎట్టా తోద్దామా? అని చూస్తో ఉంటారు.అక్కడనుండి చదువు చదువు అని రోజల్లా చదువే . రాత్రల్లా చదువే . ఊరికే చదవడమే పని . జీవితమంతా వౄధాయే కదా !
కానీ బుద్ధీమంతులు నలుగురూ కూచొని అన్ని పద్ధతుల్ని తిట్టినట్టే ఈ చదువుల్లో నిజంగా ఏది అవసరం? ఏది నిజంగా ప్రజలకి ఉత్తేజం కలిగిస్తోంది ? వీళ్ల బతుకుల్ని ఏది వికాసం చేస్తుంది? ఈ విధమైన చదువుల్ని మాత్రమే ఉంచి తక్కిన వాటిని తీసేయ్యాలి అని చర్చించుకోవాలి। ఎక్కడా బడి అంటే బలవంతం ఉండకూడదు . ఎక్కడన్నా ఓ ధర్మశాల పెట్టి మంచి భోజనాలు పెడుతున్నారనుకోండి . అందరూ పరిగెత్తరా అక్కడికి? ఎవరన్నా గెంటాలా అక్కడికి పొమ్మని? అట్టానే చదువులు కూడా . పాఠశాలలనేవి అందరికీ తెరిచి ఉండాలి , ఈ లోకమే తెరిచి ఉన్నట్టు . ఎవరికి ఏ విధమైన సంస్కారం కావాలో, ఎవరికి ఇక్కడ చెప్పే సంగతులు ఎవరిలో గొప్ప సంతోషాన్ని, ఉత్తేజాన్ని ఇస్తాయో వాళ్లందరూ రండి ఊరికే వొచ్చి కూచొని వినండి . గుళ్లల్లో సత్రాల్లో ఎక్కడన్నా పురాణం చెపుతుంటారు .ఇష్టమైన వాళ్లందరూ వినడం లేదూ? ఆ విధంగా చెప్పాలి చదువంతా .ఎవరన్నా ఒచ్చి చదవొచ్చు . ఎవరన్నా దాన్ని స్వీకరించి అర్ధ యుక్తం చేసుకోవచ్చు .ఇప్పుడు క్రమంగా ఈ దేశంలో మొదటినుంచి చివరి వరకు చదువు రెజిమెంటేషన్ గా మారిపోబోతోంది . ప్రస్తుతం విధ్యావిధానం రాజకీయాలతో అంకితమై పోయింది . తక్కిన దేశాలకన్న స్వదేశంనించి ఎక్కువ విధ్యాధికులు కావాలనే పంతం పెరిగింది . ఈ కాలేజీ లో చదువుకున్న కొద్దిమంది యువకులు ఎక్కువ సమర్ధులవుతారనే విశ్వాసం హెచ్చింది . ఆ కాలేజీలో యూనివర్సిటీలో భోధించే సబ్జెక్ట్సు కూడా ఇతర దేశాలమీద దౄష్టి పెట్టుకొనే ఏర్పరుస్తున్నారు . కనుక రాజకీయ విధానం మారితేనే గాని విధ్యా విధానం మారదు . "
--- చలం - "చలం" లో 1972 లో ...
ముందు చదువు చెప్పే విధానంలో పక్క వాడిని అనుకరించితే మంచిదేమో? " మళ్ళీ బడికి" "అక్షరజ్యోతి" "నిర్బంధ విధ్య " లాంటి అర్దం పర్ధం లేని కార్యక్రమాలు ,ఇలాంటి ఎవడూ లెక్క చేయని చట్టాలు చేసే బదులు ?

Tuesday, April 10, 2007

దేవుని పరిపాలన

దేవుని పరిపాలన అంటే ఏంటో అనుకొనేవాడిని - ఇప్పుడు కొంచెం అర్ధం అయింది - తప్పులు చేయనివ్వు - విచారణ కి ఆదేశించు - తప్పు ౠజువైతే క్షమాభిక్ష పెట్టు - ఈ లెక్కన ఎవడూ తప్పు చేయనట్టే కదా - తప్పులే జరగని లోకం దేవలోకమే(?) కదా - అదన్నమాట సంగతి .

Sunday, February 25, 2007

బ్లాగరు కోసం ఒక టూల్‌ !!!

ఇవాళ ఓ రెండు గంటలు కూచొని " పద్మ లేఖిని" ని తయారు చేసా... నాగార్జున వెన్న గారిని అడిగి ఎప్పుడో సంపాయించిన జావా స్క్రిప్టు ఉపయోగించా .... ఈ టూలుతో తెలుగులో రాసి బటను నొక్కి బ్లాగరులో పోస్టు చేయొచ్చు ... ఇంకా చాలా మార్పులు చేసే అవకాశం ఉంది .. కాని సమయమే లేదు ... ఎవరికైనా ఓపిక ఉంటే సంప్రదించండి ... ఇదేమీ కష్టమయిన పని కూడా కాదు ...

Friday, February 23, 2007

జిందాతలిస్మాత్

నా చిన్నప్పుడు మా హిందీ మాస్టారు ఏదడిగినా ఒకటే సమాధానం చెప్తే ,జిందాతిలిస్మాత్ ప్రకటన చదివి నవ్వించేవారు ...ఇప్పుడు సరిగా గుర్తు లేదు కానీ , భలేగా నవ్వొచ్చేది ఆయన హిందీలో ఆపకుండా ; "తలనొప్పి ,పంటినొప్పి, దవడనొప్పి , కంటినొప్పి, కడుపునొప్పి , నడుంనొప్పి, ఇంకా ఏ నొప్పికైనా, వాడండి - జిందా తిలిస్మాత్ " - అని అరిస్తే ... ఆ వెనువెంటనే పడే బెత్తం దెబ్బలకి ఏడుపు కూడా వచ్చేదనుకోండి ...అది వేరే విషయం .. ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఏదడిగినా " నాకు తెలియకుండా జరిగింది " అంటూ ఉంటే నాకు జిందాతలిస్మాత్ గుర్తొచ్చింది