Sunday, July 29, 2007

"పోరాడితే పోయేది?" - ప్రాణాలు

ప్రతీ వాడూ బషీర్ బాగ్ , నందిగ్రాం గురించి అడిగేవాడే .. అంతేతప్ప ప్రస్తుతం ప్రాణం పోయిన వారి గురించి ఆలోచించేదెవడు ? ఉద్యమం లో ప్రాణం ఎప్పుడూ పేద వాడిదే ఎందుకు పోతుంది? ముందుండి నడిపించేవాడు నాయకుడు అయి ఉంటే ముందు నాయకుడు కదా పోవాల్సింది ? మరో సారి ౠజువు చేసారు .. ఉద్యమం తప్ప లక్ష్యం ముఖ్యం కాదు అని .. ఇంతకీ సాధించింది ఏంటి? బషీర్ బాగ్ కాల్పులకి కరెంటు చార్జీలు తగ్గాయా? నందిగ్రాం కాల్పులకి టాటాల కర్మాగారం రాకుండా పోయిందా? పోయేదీ , పోతున్నదీ పేదవాడి ప్రాణం ... "పోరాడితే పోయేది సంకెళ్లు" కాదు ...ప్రాణాలు .. అవికూడా .. అమాయక ప్రజలవి ..

Thursday, July 12, 2007

అ.అ.ఆ - భా.ప్ర.బి

నిన్న రాయలనుకొన్న మిగతా భాగం ....
2020 ఒకానొక రోజు ..ఏ రోజనేది అనవసరం ..పనేమీ లేక ఖాళీగా ఉన్న అ.అ.ఆ( అమెరికా అధ్యక్ష పీఠం మీదున్న ఆంధ్రుడు) భా.ప్ర.బి( భారత ప్రధాని బిల్) తో పిచ్చాపాటిగా వీడియో కాన్ఫరెన్సు లో ...
అ.అ.ఆ : హలో బిల్ .. ఎలా ఉంది భారతం ?
భా.ప్ర.బి : ఏదో ఉంది .. చేతులు కట్టి పడేసినట్టుంది .. చేయడానికి యుద్దాలే లేవు .. ఈ భారతీయులు ఇంత శాంతి కామకులేంటో .. అప్పట్లో ఇరాకు, ఇరాను ,క్యూబా లుండేవి ..ఇప్పుడవి లేవు ..కనీసం పాకిస్తానుతో నయినా చేద్దాం అంటే ..మాటలే తప్పితే చేతలు దాకా వచ్చేలా లేదు ..
అ.అ.ఆ: భారత్ లో అంతే ... మా వాళ్లు వాళ్లళ్లో వాళ్లు కొట్లాడుకొంటారు ..ఖమ్మం జిల్లా వాళ్లు ప్రత్యేక రాష్ట్రం ...తెలంగాణా తెలుగుకి ప్రాచీన హోదా ....వగైరాలు ఉంటాయి కద ..ఆవిధంగా ముందుకెళ్లాలి మరి ..
భా.ప్ర.బి: అది ఉందనుకో ..ఈ కమ్యునిస్టుల సంగతేంటి .. నెలకో కొత్త ఉద్యమం అంటారు ?
అ.అ.ఆ: అది మామూలే ... వాళ్లకి ఉద్యమం ముఖ్యం .. లక్ష్యం కన్నా ... మనకి లాభించేది అయితే మన పాలన లేని చోట వాళ్లతో కలిసి పోరాడటమే.. మనం పాలనో ఉన్న చోట వాళ్ల ఒత్తిడికి కొంచెం తలొగ్గినట్టు నటిస్తూ ముందుకు పోవాలి ...
బా.ప్ర.బి : అంతే నంటావా ...సరే నీ సంగతేంటి ?
అ.అ.ఆ : ఇక్కడ కూడా అదే పరిస్థితి .. జన్మ భూమి, ప్రజల వద్దకు పాలన, వెలుగు ,దీపం వగైరాలు చేపట్టి ముందుకు పోదాం అంటే ఆ అవకాశమే లేకుండా చేసారుగా .. వినూత్నం గా చంద్రమండలానికి రోడ్డు వేసి ముందుకు పోదామనుకోటున్నాం ..విజన్ 2050 లో అదొక కార్యక్రమం ..అలాగే ఇక్కడి రైతన్నలు I.T ఫలాలు పండిచడమనే మరొక కార్యక్రమం చేపడుతున్నా ....

Wednesday, July 11, 2007

అమెరికా అధ్యక్ష పీఠం మీద తెలుగు వాడు

2020 .. అమెరికా అధ్యక్ష పీఠం మీద తెలుగు వాడు ..2007 తానా సభల్లో చెప్పుకొన్నట్టు ..ఆ తెలుగువాడు మరొవరో కాదు .. C.B నాయ్డు .. అవును రోజుకి పద్దెనిమిది గంటలు కష్టపడి పనిచేసే CBN .. vision 2020 కోసం రోజుకి పద్దెనిమిది గంటలు పనిచేసిన CBN ...చేయడానికి పనేమీ లేక చిరాగ్గా ఉంది ...కరెంటు కష్టాలు లేవు..పోనీ జన్మ భూమి లాంటి ప్రజాదరణ పొందే పధకం మొదలెడదామా అంటే చెరువుల్లో పూడికే లేదు ...నీళ్లు పుష్కలంగా ఉన్నాయి .. రోడ్లేఇద్దామా అంటే ఆ అవసరమే లేదులా ఉంది .. పనికి ఆహార పధకం అవసరమే లేదు .. పోని సరదాగా రెడ్డి గారిని కవ్విద్దాం అంటే ఆయన ఇంకా ఆంధ్రా లోనే ఉండి ప్రోజెక్టుల మీద ప్రోజెక్టులు మొదలెడుతూ ( పూర్తి చేస్తారేమో అని జనం ఎదురు చూస్తూనే ఉన్నారనుకోండి ) బిజీ గా ఉన్నాడు .. ఏదో ఒకటి చేయాలి ..లేకపోతే రోజుకి పద్దెనిమిది గంటల వ్రతం చెడిపోయేలా ఉంది .. కానీ ఏం చేయాలో అర్ధం కావడం లేదు ...
ఏం చేస్తాడో ?

Wednesday, June 06, 2007

టూకీగా కొన్ని ???

శ్రీమతి & శ్రీ దగ్గుపాటి రామారావు గారి కుటుంబమా? కాదా?
తెరాస , కాంగ్రెస్సు రాసుకొంటే తెలంగాణా రాలిందా?
కాంగ్రెస్సు , ఎర్రజండాలు రాసుకొంటే పోలవరం ఆగిందా?

Tuesday, May 29, 2007

టూకీగా

మంత్రిపదవి ఎందుకు?
ఇంట్లో పెళ్ళాం , పిల్లల మోజు తీర్చడానికి ..
ఉప్పనూతల గారి ఉవాచ

Friday, May 18, 2007

పునరంకితం

పునరంకితం ఎవరు దేనికి అవుతున్నారో అర్ధం కాకుండా ఉంది ... రెండేళ్లలో రెండున్నర లక్షల ఉద్యోగాలు సౄష్టిస్తామని అన్నారని గుర్తు ... రెండున్నర లక్షల ఉద్యోగాలేమో గాని రెండువందల యాభై వరకు పదవులు మాత్రం తయారు చేసి పంచి పెట్టారు ...మండలితో కలుపుకొని ... మరి ముఖ్యమంత్రి, కొందరు ప్రముఖులే పునరంకితం అయితే పెజా సేవ లో వెనకబడి పోతారు కదా .. పునరంకితం అయ్యే అవకాశం అందరికీ కల్పించడం నిజంగా ముదావహం ...పనిలో పనిగా పాతబస్తీలో అల్లర్లు చేసే మూక కూడా వారి పనికి పునరంకితం అవుతున్నట్లున్నారు .. పాతబస్తీ అల్లర్లు కాంగ్రెస్సు అధికారం లో ఉన్నప్పుడే ఎందుకు జరుగుతాయో ...

Monday, April 16, 2007

టూకీగా

భార్యా భర్తల మధ్య మాటలు లేనప్పుడు - ఇంట్లో గిన్నెలు , తపాలాలు మాట్లాడతాయి :)

Friday, April 13, 2007

చదువు

ఏంటబ్బా ఇంకా మనవాళ్లు వెనకబడి ఉన్నారు అనుకొంటున్నా -- తెచ్చేసారు కొత్త చట్టం - పిల్లలని కొడితే జైలు --- భేష్
" అసలు సంస్కారం ఉండాలి .చదువుకొనే ఆసక్తి ఉండాలి .చదువుని ఎంజాయ్ చేయాలి .రాత , అట్టానే చదువు అట్టానే ఉండాలి .రాయడం ఒక అనుభవం , మనం ఏదైనా సరే మనుసుని వికసింపచేసేది , అసలు మనసుని ఆహ్లాద పెట్టేది ఏది చెప్పినా అది గొప్ప లిటరేచర్ అయిపోవాలి ఆ చదివేవాళ్లకి గూడా అబ్బా! ఈ పుస్తకం ఇవాళ చదవాల్సి వచ్చిందే, ఏం కర్మం పట్టిందని తెల్లారగట్టే లేచి కూచొని చదివేట్టుగా ఉండకూడదు. తక్కిన సంతోషాలు లోకంలో ఉండవూ. ఆవిధంగానే తను ఎంజాయ్ చేసేటటువంటి ఒక విషయంగా ఉండాలి చదువు అంటే.బడి ఉంటుంది , దాంటో పాఠాలు అక్కర్లేదు . మనం కావలసిన కధల పుస్తకాలో, నవలలో, ప్రయాణపు కధల పుస్తకాలో , ఇవన్నీ కూడా చదువుకునేందుకు ఉపయోగపడాలి . గొప్ప కవిత్వం తెలుసుకోవాలి . ఎంతసేపటికి ఈ క్లాస్ పాస్ అయి పైక్లాస్ ని ఎట్టా పోవాలి? అందులో కూడా తను క్లాస్ సంపాయించాలి. తక్కిన వాళ్లతో పోటీబడి తను ప్రధముడై రావాలి . తను ఏ విధంగా వచ్చినా సరే, దాని కోసం ఎన్ని సంవత్సరాలు ప్రజల జీవితాలు కాలిపోతున్నాయో చూడండి. పుట్టినప్పటినుంచి రెండో ఏడో, మూడో, పదో ఎప్పుడు వస్తుందా? వీణ్ణి ఎట్టా తోద్దామా? అని చూస్తో ఉంటారు.అక్కడనుండి చదువు చదువు అని రోజల్లా చదువే . రాత్రల్లా చదువే . ఊరికే చదవడమే పని . జీవితమంతా వౄధాయే కదా !
కానీ బుద్ధీమంతులు నలుగురూ కూచొని అన్ని పద్ధతుల్ని తిట్టినట్టే ఈ చదువుల్లో నిజంగా ఏది అవసరం? ఏది నిజంగా ప్రజలకి ఉత్తేజం కలిగిస్తోంది ? వీళ్ల బతుకుల్ని ఏది వికాసం చేస్తుంది? ఈ విధమైన చదువుల్ని మాత్రమే ఉంచి తక్కిన వాటిని తీసేయ్యాలి అని చర్చించుకోవాలి। ఎక్కడా బడి అంటే బలవంతం ఉండకూడదు . ఎక్కడన్నా ఓ ధర్మశాల పెట్టి మంచి భోజనాలు పెడుతున్నారనుకోండి . అందరూ పరిగెత్తరా అక్కడికి? ఎవరన్నా గెంటాలా అక్కడికి పొమ్మని? అట్టానే చదువులు కూడా . పాఠశాలలనేవి అందరికీ తెరిచి ఉండాలి , ఈ లోకమే తెరిచి ఉన్నట్టు . ఎవరికి ఏ విధమైన సంస్కారం కావాలో, ఎవరికి ఇక్కడ చెప్పే సంగతులు ఎవరిలో గొప్ప సంతోషాన్ని, ఉత్తేజాన్ని ఇస్తాయో వాళ్లందరూ రండి ఊరికే వొచ్చి కూచొని వినండి . గుళ్లల్లో సత్రాల్లో ఎక్కడన్నా పురాణం చెపుతుంటారు .ఇష్టమైన వాళ్లందరూ వినడం లేదూ? ఆ విధంగా చెప్పాలి చదువంతా .ఎవరన్నా ఒచ్చి చదవొచ్చు . ఎవరన్నా దాన్ని స్వీకరించి అర్ధ యుక్తం చేసుకోవచ్చు .ఇప్పుడు క్రమంగా ఈ దేశంలో మొదటినుంచి చివరి వరకు చదువు రెజిమెంటేషన్ గా మారిపోబోతోంది . ప్రస్తుతం విధ్యావిధానం రాజకీయాలతో అంకితమై పోయింది . తక్కిన దేశాలకన్న స్వదేశంనించి ఎక్కువ విధ్యాధికులు కావాలనే పంతం పెరిగింది . ఈ కాలేజీ లో చదువుకున్న కొద్దిమంది యువకులు ఎక్కువ సమర్ధులవుతారనే విశ్వాసం హెచ్చింది . ఆ కాలేజీలో యూనివర్సిటీలో భోధించే సబ్జెక్ట్సు కూడా ఇతర దేశాలమీద దౄష్టి పెట్టుకొనే ఏర్పరుస్తున్నారు . కనుక రాజకీయ విధానం మారితేనే గాని విధ్యా విధానం మారదు . "
--- చలం - "చలం" లో 1972 లో ...
ముందు చదువు చెప్పే విధానంలో పక్క వాడిని అనుకరించితే మంచిదేమో? " మళ్ళీ బడికి" "అక్షరజ్యోతి" "నిర్బంధ విధ్య " లాంటి అర్దం పర్ధం లేని కార్యక్రమాలు ,ఇలాంటి ఎవడూ లెక్క చేయని చట్టాలు చేసే బదులు ?

Tuesday, April 10, 2007

దేవుని పరిపాలన

దేవుని పరిపాలన అంటే ఏంటో అనుకొనేవాడిని - ఇప్పుడు కొంచెం అర్ధం అయింది - తప్పులు చేయనివ్వు - విచారణ కి ఆదేశించు - తప్పు ౠజువైతే క్షమాభిక్ష పెట్టు - ఈ లెక్కన ఎవడూ తప్పు చేయనట్టే కదా - తప్పులే జరగని లోకం దేవలోకమే(?) కదా - అదన్నమాట సంగతి .

Sunday, February 25, 2007

బ్లాగరు కోసం ఒక టూల్‌ !!!

ఇవాళ ఓ రెండు గంటలు కూచొని " పద్మ లేఖిని" ని తయారు చేసా... నాగార్జున వెన్న గారిని అడిగి ఎప్పుడో సంపాయించిన జావా స్క్రిప్టు ఉపయోగించా .... ఈ టూలుతో తెలుగులో రాసి బటను నొక్కి బ్లాగరులో పోస్టు చేయొచ్చు ... ఇంకా చాలా మార్పులు చేసే అవకాశం ఉంది .. కాని సమయమే లేదు ... ఎవరికైనా ఓపిక ఉంటే సంప్రదించండి ... ఇదేమీ కష్టమయిన పని కూడా కాదు ...

Friday, February 23, 2007

జిందాతలిస్మాత్

నా చిన్నప్పుడు మా హిందీ మాస్టారు ఏదడిగినా ఒకటే సమాధానం చెప్తే ,జిందాతిలిస్మాత్ ప్రకటన చదివి నవ్వించేవారు ...ఇప్పుడు సరిగా గుర్తు లేదు కానీ , భలేగా నవ్వొచ్చేది ఆయన హిందీలో ఆపకుండా ; "తలనొప్పి ,పంటినొప్పి, దవడనొప్పి , కంటినొప్పి, కడుపునొప్పి , నడుంనొప్పి, ఇంకా ఏ నొప్పికైనా, వాడండి - జిందా తిలిస్మాత్ " - అని అరిస్తే ... ఆ వెనువెంటనే పడే బెత్తం దెబ్బలకి ఏడుపు కూడా వచ్చేదనుకోండి ...అది వేరే విషయం .. ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఏదడిగినా " నాకు తెలియకుండా జరిగింది " అంటూ ఉంటే నాకు జిందాతలిస్మాత్ గుర్తొచ్చింది

Friday, February 16, 2007

బ్రాహ్మీ ముహుర్తం

తెల్లారుజామున యోగా ,ధ్యానం చేస్తే బెమ్మాండమయిన ఆలోచనలొస్తాయని ప్రియతమ ముఖ్యమంత్రి సెలవిచ్చారు . దానర్ధం మిగతా వారందర్నీ ఆ పని చేయమనేమో ..ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఇట్టాంటి అమూల్యమయిన అభిప్రాయం వెలిబుచ్చారని గుర్తు ..ఆయనో అడుగు ముందుకేసి తమ్ముళ్లందరికి యోగా తరగతులు కూడా నిర్వహించిన గుర్తు ..ఏమో ఈ నాయకులు మాటలు చేతలు నిముషానికి ఒకటి ఉంటే ఎవడేమన్నాడో ఎవడికి గుర్తు ...పాపం ఆ బాధ నుండి తప్పించడానికేనేమో నువ్వు అది చేసావ్ , ఇది చేయలేదు అని ప్రస్తుతాలు మాజీలకి అనుక్షణం గుర్తు చేయడం..అంతేతప్పితే తామేంచేస్తామో ఎవడూ చెప్పేలా లేడు ..అన్నట్టు సదరు బ్రాహ్మీ ముహుర్తంలో వచ్చిన ఒకానొక బెమ్మాండమయిన ఆలోచన "ఇందిరమ్మ చెరువులు" అని ముఖ్యమంత్రిగారు సెలవిచ్చారు ..అప్పుడెప్పుడో బాబు గారు "నీరు - మీరు" అనో ఇంకేదో పేరుతోనో ఇట్టాంటిదే ఏదో పధకం దిగ్విజయంగా ( ఆయన దౄష్టి లో ) నిర్వహించినట్టున్నారే ..కాస్త కాస్త గుర్తొస్తుంది ..నే చెప్పలా వీళ్లు వాళ్లని గుర్తు చేస్తారని ..ఇంకో అధ్బుతమయిన ఆలోచన ..బొగ్గు ని విద్యుత్తు ఉత్పత్తి కి వాడాలని ...తద్వారా నీటి ని ఆదా చేయొచ్చని ..పనిలో పనిగా నల్లగా ఉండటం వలన బాబుకి బొగ్గు నచ్చలేదని చురక ..బొగ్గు అనేది ఒకసారి వాడితే మరలా మరలా భూమిలో తయారు కాదు ....కొన్నాళ్లకి బొగ్గు అడుక్కోవలసి రావడం ఖాయం ..కానీ నీరు అలా కాదేమో కదా ..ఆ మాత్రం ఆలోచన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి , బ్రహ్మీ ముహూర్తంలో , వచ్చి ఉండదా? ఏమో ఆయన అదికూడా ఆలోచించి ఉంటారేమో ..బుద్ది లేని , కాదు కాదు , విచక్షణ లేని వాళ్లం మనకేం తెలుసు ..

Thursday, February 08, 2007

త్యాగమూర్తులు

ఆ మధ్య దేశంలో కోట్లకి పడగలెత్తిన వారి జాబితా ఒకటి ప్రచురించారు ..గత పదేళ్లుగా ఆ జాబితాలో చేరేవారి సంఖ్య పెరుగుతూ వస్తుందని చదివి సంతోష పడ్డా .. వెనకబడ్డ దేశమో అని అరిగిపోయిన గ్రామఫోను ని పాడేసి కొత్త i-pod ( తెలుగు తర్జుమా చేయలేదు ఇంకా ఎవరూ) లో i-tune విన్నట్టనిపించిది ... కానీ ఇప్పుడనిపిస్తుంది ... త్యాగమూర్తుల జాబితా తయారు చేస్తే ఇంకా బావుండేదేమో అని ...మొదట మేడం సోనియా ..రెండు మన ప్రిఅయతమ ముఖ్యమంత్రి గారు .. డబ్బు సంపాయించడం ఏముంది ..కాస్త తెలివి , కష్టపడితే ఇవాల్టికి కాకపోతే ఎప్పుడో ఒకప్పుడు అ జాబితాలో చోటు సంపాయించొచ్చు ..కానీ సంపాయించిన దాన్ని ( ఎలా సంపాయించారు అన్నది పక్కన పెడితే) తౄణప్రాయంగా వదిలేయడం అనేది చాలా గొప్పది ..కష్టమయిందీనూ ..జాబితాలో మూడో స్థానం దక్కాల్సిన బొత్స బాబుకి ఆ అవకాశం కొద్దిలో తప్పిపోయింది ...

Friday, December 15, 2006

గత రెండున్నరేళ్లుగా ఆంధ్ర ప్రజలకి కాలక్షేపం :

ఉచిత విద్యుత్తు మీద రాద్దంతం
జల యగ్నం లో అవకతవకలు
సీమ లో రాజకీయ హత్యలు
హత్యకు పర్యవసానంగా ఉప ఎన్నిక
దేవుని మాణ్యాల ఆక్రమణలు
మునిసిపాలిటీ ఎన్నికలు
వోక్సువ్యాగన్ భాగోతం
నక్సలైట్లతో చర్చలు
క్షమభిక్షల పై క్షమాపణలు
అవుటరు రింగురోడ్డు పై అరుపులు
తెలంగాణా ఉప ఎన్నిక
భూముల అప్పగింత
.
.
.
పనికొచ్చె పని ఒక్కటన్నా ఉందా పై వాటిల్లో?

Sunday, October 15, 2006

క్షమాభిక్ష

క్షమాభిక్ష - తెలుగు బాష లో ఆ పదం ఒక్కటే ప్రియతమ ముఖ్యమంత్రి గారికి నచ్చనిది ప్రస్తుతం ...అయినా అందరూ తెగ రెచ్చిపోతున్నారు ...అంతగా కాని పని ఏమి చేసాడు ఆయన మాత్రం ..ముగ్గురికి సహాయం కార్యకమంలా ప్రియతమ ముఖ్యమంత్రి ఆయనకి తగ్గట్టు పెద్ద ఎత్తున సదరు కార్యక్రమాన్ని నడుపుతున్నారు ...ప్రచారానికి దూరంగా ఉండటం ఆయన నైజం కనుక ఆ విషయం జనానికి అంతగా తెలియలేదు ...ఆయన చేసిన అసలు తప్పు సదరు కార్యక్రమానికి ముందర "రాజీవ్ " లేదా "ఇందిర" పేరు తగిలించి దానికి తగిన ప్రచారం కల్పించక పోడం ..ఓ పక్క కోర్టు ఈ విషయం లో ఎడాపెడా వాయించినా , తెల్లారి , మైనార్టీ లకి హామీ ..కోర్టు లో పోరాడి వారికి సహాయ పడతానని ...పత్రికలు మొట్టికాయలు అని మనుషలని ఎత్తిపొడుస్తున్నాయి ...రాళ్ల వర్షం అని దున్నపోతులని నొప్పించడం ఇష్టం లేక కావొచ్చు ...మైనార్టీల కష్ట సుఖాలు తెలుసుకోడానికే కరీంనగరులో ఇఫ్తారు కి హాజరయారట ...రాబోయే ఎన్నికల కోసం అనుకునేరు ..కానేకాదు ..కావాలంటే ఆయన మనస్సాక్షి ని అడగండి ...అసలయినా తప్పు ప్రియతమ ముఖ్యమంత్రి గారిదో, ఆయన మంత్రివర్గానిదో కాదు ...కె సి ఆర్ అనబడే మనిషిది ..ఎవడిష్టం వచ్చినట్టు వాడు , తనకి బోరు కొట్టినప్పుడల్లా రాజీనామాలు చేస్తుంటే జనానికి కూడా చిర్రెత్తి ఓటేయడం మానేస్తారు ..ఓ మర్చిపోయా ''ఆయనే ఉంటే మంగలెందుకని " ...
ఇది రెండో సారి నేను రాయడం ,శ్రీధర్ బొమ్మ వేయడం ఒకేరోజు :)

సౌజన్యం : ఈనాడు

Saturday, July 29, 2006

చలం

చీకటి నీళ్ల మీద కమ్మేసిన సమయాన.తామరాకులు నీటి మీద పరచుకొని నిద్రపోతున్నాయి...గాలి వొచ్చి ఆకుల్ని ఒక మూల ఎత్తి పలకరిస్తే అలసి కళ్ళు మూతలు పడ్డ ప్రియురాలి వలె ప్రేమతో తప్పించుకొని మళ్లీ పడుకొంటున్నాయి అవి ...

ఉదయ సూర్యుడు నేర్పుగల ప్రియుడివలె యీ చెరువు మధ్య తామర మొగ్గల చివరల్ని కిరణపు కొనలతో తాకి, యెర్రబారేట్టు పులకరింప చేస్తున్నాడు ..
ఫాల్గుణ మాసపు మధ్యాహ్నం వేదిగా ఉన్నానా, చల్లగా ఉన్నానా అని సందేహించేసోమరి గాలి, విచ్చని మల్లెపూల పసి తెల్లదనం, వాటిలో దాక్కుని నిద్రబోతూఉన్న పరిమళాన్ని సూచించే పచ్చి వాసన గిన్నెలో నీళ్ల చల్లదనం...
.
ఎండాకాలపు దక్షిణగాలి, తెల్లారకట్ట అలసటనిద్ర,కోవిల అరుపు- లేవ వద్దనే ప్రియురాలి గట్టి కౌగిలి , మల్లెపూల పరిమళం --అన్నీ ఒకటిగా కలిసి జ్ణాపకం వస్తాయి--లోకం సారవిహీనమని అధైర్య పడినప్పుడల్లా.

అందమైన ఉదయం, పెద్ద చెట్లు ఆకాశం కనపడకుండా రోడ్డు పక్కనీచి నెత్తి మీద కలుసుకోడం చేత వాటి ఆకుల్లోంచి లోపలికి వచ్చే కాంతి రకరకాల రంగులతో కళ్లకి శాంతినిస్తోంది ...

భూమిని, సూర్యుడు కాల్చిన స్థలాల,మానవుడు తవ్విన ప్రదేశాల, గాయాల్ని యీ కొత్త పచ్చగడ్డి కప్పి వోదార్చింది.ఈ వానలకి ఎడారిలాగైపోయిన యీ సీమ కొత్త అందాలతో కలకల లాడుతోంది .చివరికి యీ బురద తాలూకా కూడా, ఏమీ ఆకర్షణ లేదనుకొన్న భార్య ఒక రోజు ఆకుపచ్చ చీర కట్టుకొని ఎన్నడూ లేని శ్రుంగారాన్ని ఎరువు తెచ్చుకున్నట్టుంది...

---- మ్యూజింగ్స్ నుండి

Wednesday, July 12, 2006

ముంబయి

బొంబాయి ఉలిక్కి పడింది ....కొన్ని గంటల్లో సర్దుకొంది ...కొన్ని చోట్ల అసలేమీ జరగనట్టు జనం తమ తమ పనుల్లో మునిగి పోయారు ...పక్క రాష్ట్రాల్లో అసలా విషయమే పట్టనట్టు అంతకంటే ముఖ్యమైన పనులు చక్కబెట్టటం లో హడావిడి గా ఉన్నారు ...ఉదాహరణ కి మండల ఎన్నికలు ...
ముంబయి లో బాంబు పేలితే న్యూయార్కు లో రైళ్లు ఓ సారి ఆగాయి ...ముందు జాగ్రత్త చర్యలు ...పెరిగిన గస్తీలు ...షికాగో లో రైలు పట్టాలు తప్పితే జనం పరుగులు ...అక్కడనుండి దూరంగా పారిపోవడానికి ...అదీ టెర్రరిస్టుల పనేనేమో అని భయంతో ...
భారతావని లో ఇదేమీ మొదటి సారి కాదు ఇలాంటి దురాగతం జరగటం ...కానీ ఎన్నడూ లేనిది ..ఈసారి ఎంచేత ఒకరి తరువాత ఒకరు ఖండించడాలు? బ్లెయిర్ , రైస్, ఖార్జాయ్, ముషరఫ్ ...ఒకప్పుడు కాశ్మీర్ లో ఉన్నది ఉగ్రవాదులు అంటే వినీ విననట్టున్న ఇవే దేశాలు ఇవాళ ఉన్నట్టుండి కళ్లు తెరిచాయేంటో?
ఇక మన నాయకులు ...షరా మాములే ...ఖండించడాలు , నిందించడాలు ...శివరాజ్ పాటిల్ గారు మాడం సోనియాకు పరిస్థితి నివేదించారట ...భేష్...వచ్చే ఎన్నికలలో టికెట్టు ఖాయం ...CNN వాడు మొట్ట మొదటగా దౄశ్యాలను ప్రసారం చేసాడట ...కాలరు ఎగరేయలేక కష్టాలు పడుతున్నాడు ..
ఇద్దరే ఇద్దరు ...ఎగేసుకొంటూ వచ్చే నాయకులని రావొద్దు అని సున్నితంగా చెప్పిన శరద్ పవార్...రెండో వారు ...వెంటనే స్పందించిన సామాన్య ప్రజలు ..బాంబు పేలగానే ఎక్కడివక్కడ వదిలేసి పరుగులు తీయకుండా (విదేశంలో లా) , ప్రభుత్వం పంపే సహాయం కోసం ఎదురు చూడకుండా ,రంగంలోకి దిగి సహాయం చేసిన ప్రజ,వర్షంలో తడుస్తూ కూడా ఆసుపత్రినుంచి ఆసుపత్రికి రక్తాన్ని ఇవ్వడానికి తిరిగిన సామాన్య ప్రజ ...mumbaihelp.blogspot.com లో తమకి చేతయిన సాయం చేస్తున్న సామాన్య జనం ॥।

Friday, May 26, 2006

టూకీగా ...

రిజర్వేషన్ల గురించి రాయమన్నారు ..

మన్మోహన్ బుష్ తో : వచ్చే ఏడాది మేము భారతీయులని చంద్రుని పైకి పంపుతున్నాం

బుష్ : వావ్ ...ఎందరిని?

మన్మోహన్ : 100 - 25 ఓబీసీ, 25 ఎస్ సి , 20 ఎస్ టి , 5 వికలాంగులు,5 క్రీడాకారులు , 5 తీవ్రవాద పీడితులు,5 కాశ్మీరు నుండి వలస వచ్చిన వారు ,9 రాజకీయ నాయకులు , వీలైతే ఒక వ్యోమగామి ...


సౌజన్యం : మిత్రుడు జగ్గూ

Sunday, May 21, 2006

టూకీగా ...

ఆంధ్ర లో ఉన్న అమ్మమ్మ " మాకు ఇక్కడ మంచి మామిడికాయలు వస్తున్నాయి గా "
అమెరికాలో ఉన్న మనవరాలు " మ్యాంగో లకి కాళ్ళు ఉంటాయా? ఎలా వస్తాయి?"

Tuesday, May 16, 2006

పురుగు కుట్టిందోచ్ ...

నేను చదివిన ఒక పుస్తకం - దీన్ని పుస్తకం అనొచ్చో లేదో - చలం మ్యూజింగ్స్ - దీనితో పాటు దాదాపు చలం రాసిన పుస్తకాలన్నీ చదివా .. కానీ వాటన్నిటికీ దీనికీ పోలికే లేదు ..నాకు కనిపించలేదు .. నేననుకోడం ఆ పుస్తకాలన్నీ దాదాపు ఒకే అంశం చుట్టూ తిరుగడం వలనేమో ...మ్యూజింగ్స్ చలం ఆలోచనలని మన ముందు ఉంచుతుంది ...చలం అలోచనలు , ఆలోచనా విధానం మనకు నచ్చక పోవచ్చు ..కానీ మనకి నచ్చలేదు అన్న విషయం చదివినంత సేపు తట్టనివ్వకుండా రాస్తాడు .. అది చలం గొప్పతనం అని నా అభిప్రాయం ..ఆ .వర్ణన అతనొక్కడికే సాధ్యం ...వీలైతే చదివి చూడండి ..నాకు వీలైతే కొన్ని భాగాలు ఇక్కడ రాయడానికి ప్రయత్నిస్తా ...
ఇప్పుడు పురుగుని ఎవరిమీదకి వదలాలో?